Tirumala : తిరుమల నడక మార్గంలో బంధించిన చిరుతలకు విముక్తి ఇప్పట్లో కలిగేనా…

శేషాచలం కొండల్లోని చిరుతల సంచారం నరకమార్గాల్లోని భక్తులను గత 6 నెలలుగా బెంబేలెత్తిస్తున్నాయి. గతేడాది జూన్ ఆఖరిలో 5 ఏళ్ల కౌశిక్ పై దాడి, ఆగస్టులో 10 ఏళ్ల లక్షిత పై దాడి చేసిన చిరుతలు ఇప్పటికీ నడక మార్గంలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. తిరుమలకు నడకమార్గాల్లో చేరుకునే భక్తుల్లో భరోసాను కల్పించే ప్రయత్నం చేసిన టీటీడీ అటవీశాఖ సహకారంతో అనేక చర్యలు చేపట్టింది.

Tirumala : తిరుమల నడక మార్గంలో బంధించిన చిరుతలకు విముక్తి ఇప్పట్లో కలిగేనా...
Leopard
Follow us
Raju M P R

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 10, 2024 | 9:56 AM

6 నెలల్లో 6 చిరుతలను బంధించిన అటవీశాఖ లక్ష్మిత ను పొట్టన పెట్టుకున్న చిరుత ను గుర్తించేందుకు మరింత కాలం పడుతుందా.. అసలు ఇప్పటిదాకా పట్టుకున్న చిరుతల్లో లక్షిత ను చంపిన చిరుత ఉందా… ఐసర్ సైంటిస్టులు సేకరించిన నమూనాల ఫలితాలెప్పుడు వస్తాయి. అసలు ఆ రిపోర్ట్ లో ఏముందని అటవీశాఖ భావిస్తోంది. శేషాచలం కొండల్లోని చిరుతల సంచారం నరకమార్గాల్లోని భక్తులను గత 6 నెలలుగా బెంబేలెత్తిస్తున్నాయి. గతేడాది జూన్ ఆఖరిలో 5 ఏళ్ల కౌశిక్ పై దాడి, ఆగస్టులో 10 ఏళ్ల లక్షిత పై దాడి చేసిన చిరుతలు ఇప్పటికీ నడక మార్గంలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. తిరుమలకు నడకమార్గాల్లో చేరుకునే భక్తుల్లో భరోసాను కల్పించే ప్రయత్నం చేసిన టీటీడీ అటవీశాఖ సహకారంతో అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆరు చిరుతలను బంధించింది. నడకమార్గానికి దగ్గరగా వచ్చే చిరుతలను కెమెరా ట్రాప్స్ ద్వారా గుర్తించి బోన్లు ఏర్పాటు చేసి బంధించింది.

ఇప్పటిదాకా 6 చిరుతలను పట్టుకుని అందులో మూడింటికి విముక్తి కలిగించిన అటవీశాఖ ఇంకా మూడు చిరుతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని పరిస్థితి నెలకొంది. అలిపిరి నడక మార్గంలోని 7 వ మైలు వద్ద రిపీటర్ రూం వద్ద గతేడాది జూన్ 23 రాత్రి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ పై చిరుత దాడి చేసి గాయపరచగా అదే ప్రాంతంలో 24 న ఉదయానికి చిరుతను బంధించిన అటవీశాఖ.. తలకోన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. ఆ తరువాత ఆగస్టు లో లక్షిత పై దాడి చేసి చంపిన చిరుతను బంధించేందుకు టీటీడీ అటవీ శాఖ ఆపరేషన్ చిరుత చేపట్టింది. అప్పటినుంచి ఇప్పటిదాకా 6 చిరుతలను అటవీశాఖ బంధించగా నడకమార్గాల్లో చిరుతల భయం లేకుండా టీటీడీ పలు చర్యలు చేపట్టింది. అయితే పట్టుబడ్డ చిరుతల్లో లక్షితపై దాడి చేసిన చిరుత ఏదన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టత రాకపోవడంతో అటవీశాఖలో ఆపరేషన్ చిరుత అంశం సందిగ్ధతకు కారణం అయ్యింది.

అలిపిరి నడక దారిలో 6 నెలల్లో 6 చిరుతలను బంధించిన అటవీశాఖ గత ఏడాది లక్షిత పై దాడి చేసి చంపిన చిరుత ను గుర్తించే పనిలో ఇప్పటికే నిమగ్నమైంది. ఇప్పటి దాకా 3 చిరుతలకు విముక్తి కలిగించిన అటవీ శాఖ అధికారులు 2 చిరుతలను అటవీ ప్రాంతంలోకి, ఒక చిరుతను విశాఖ జూ పార్క్ కు తరలించారు. ఇంకా ఎస్వీ జూ పార్క్ లోనే బందీగా 3 చిరుతలు ఉండగా.. జూ పార్క్ లో ఉన్న 3 చిరుతల్లో ఒక చిరుతకు పళ్ళు లేకపోవడంతో వేటాడలేదని జూ వైద్యులు తేల్చారు. దీంతో ఆ చిరుతను జూ పార్క్ లోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్న అధికారులకు మిగతా రెండు చిరుత లపైనే డౌట్ ఉంది. లక్షిత పై అటాక్ చేసి చంపిన చిరుత ఏదన్న దానిపై ఇప్పటికే క్లారిటీ రాక పోగా.. ప్రాథమిక నివేదిక ప్రకారం జూలోని రెండు చిరుతల్లో ఒక చిరుత లక్షితను పొట్టన పెట్టుకుని భావిస్తున్నారు. అయితే ఆ చిరుత ఏదై ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితి లో ఉన్న అటవీశాఖ అధికారులు నడక దారిలో బోన్లు పెట్టి బంధించిన చిరుతల నమూనాలు సేకరించిన సైంటిస్టులు ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

లక్షిత పై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు నమూనాలు సేకరించి ఐసర్ శాస్త్రవేత్తల పరిశోదనలు ఇంకా కొనసాగుతుండటంతో 6 నెలలు గడుస్తున్నా ఇంకా రిపోర్ట్ రాని పరిస్తితి నెలకొంది. అయితే త్వరలోనే నివేదిక వస్తుందని చెబుతున్న తిరుపతి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సతీష్ ప్రాథమికంగా జూలో ఉన్న 3 చిరుతల్లో రెండింటిపై అనుమానం ఉందంటున్నారు. ఇక ఎస్వీ జూ పార్క్ లోని మూడు చిరుతల్లో ఒక చిరుత పళ్ళు లేవని ఇప్పటికే గుర్తించిన అటవీ శాఖ దాన్ని జూలోనే కొనసాగించే అవకాశం ఉంది. ఇక రెండు చిరుతల్లో లక్షిత పై దాడి చేసిన చిరుతను గుర్తిస్తే దాన్ని మ్యాన్ ఈటర్ గా గుర్తించి జూలోనే ఉంచాలన్న ఆలోచనలో ఉన్నారు అటవీ శాఖ అధికారులు..ఇక మిగిలిన ఒక చిరుతకు విముక్తి కలిగించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..