ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె ఏపీ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో లోకేశ్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం సిద్ధంగా లేరన్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తేనే తారక్ టీడీపీలోకి వెళ్లే అవకాశముందున్నారు. ఇప్పుడు ఇంతకుమించి తానేం మాట్లాడలేనని, టీడీపీలోకి తారక్ అడుగుపెట్టాక తాను స్పందిస్తానని అన్నారు. అయితే ప్రస్తుతానికి సీఎం జగన్ పాలన చాలా బాగుందని, శ్రీవారి ఆలయ నిర్వహణ కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఎంతమంది కలిసొచ్చినాసరే.. సీఎం జగన్‌ని ఎదురించలేరని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం వీఐపీ విరామ సమయంలో లక్ష్మీపార్వతి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాగా జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులతో కొందరు టీడీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తారక్‌కు బాధ్యతలు ఇస్తే.. టీడీపీకి అతని క్రేజ్ కలిసొస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించిన కొన్ని చోట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా దర్శనమిచ్చాయి. అయితే జూనియర్ మాత్రం రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రహీరోగా వెలుగొందుతోన్న అతను మరికొంత కాలం తన సినిమాల మీదే పూర్తి దృష్టి సారించనున్నట్లు సమాచారం.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..