చెన్నై మహానగరం లోని జి ఎన్ చెట్టి స్ట్రీట్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంఖుస్థాపన నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్తోచ్చారణ మధ్య కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. టి. నగర్ లోని జి ఎన్ చెట్టి వీధిలో సినీనటి కుమారి కాంచన, శ్రీమతి వి గిరిజా పాండే, శ్రీ కెపి పాండే, శ్రీ.పి.రవిభూషణ శర్మ రూ. 40 కోట్ల విలువ చేసే 34 సెంట్ల భూమి టీటీడీకి దానంగా ఇచ్చారు. దాతల కోరిక మేరకు టీటీడీ ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. ఇందులోభాగంగా ఈ నెల 10 వ తేదీ విశ్వక్షేనారాధన, అంకురార్పణ నిర్వహించారు. 11, 12వ తేదీల్లో పంచసూక్త హోమం జరిపారు. శనివారం ఉదయం శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆలయ నిర్మాణానికి వేద మంత్రాల నడుమ నవధాన్యాలు వేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం పంచసూక్త హోమం పూర్ణాహుతిలో పాల్గొని, ఆలయ శంఖుస్థాపనకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు.
అంతకుముందు కంచి పీఠాధిపతి ఇదే ప్రాంగణంలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని తమిళనాడులో ప్రారంభించారు. 8 గోవులు, 8 దూడలకు పూజలు చేసి, నూతన వస్త్ర ధారణ, హారతులు ఇచ్చి తమిళనాడు లోని 8 ఆలయాలకు గోవు, దూడలను అందించారు. టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు, టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు, స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి దంపతులు, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్ ముప్పవరపు నిశ్చిత, శ్రీ కుమారగురు, శ్రీ గోవిందహరి, భూమి దాతలు కుమారి కాంచన శ్రీమతి వి.గిరిజా పాండే, శ్రీ కె పి పాండే ,శ్రీ. టీటీడీ సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ఈ లు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు తో పాటు స్థానిక సలహామండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమ్మవారి కృపతో దేశంలో పేదరికం తొలగిపోయి, అందరికీ ఉపాధి లభించి, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భూదానం, గోదానం, స్వర్ణ దానం వల్ల ఏడు జన్మల పుణ్యం లభిస్తుందన్నారు. చెన్నై మహానగరంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ద్వారా హిందూ ధర్మ ప్రచారం మరింతగా విస్తరిస్తుందని స్వామి చెప్పారు.టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం బాగా జరుగుతోందని, గుడికో గోమాత లాంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
Read more: