Tirupati: తిరుమలలో కిడ్నాపైన ఐదేళ్ల బాలుడు ఎక్కడున్నాడు..? రోజులు గడుస్తున్నా.. బాలుడి ఆచూకీ కనిపించడం లేదు. సీసీ కెమెరాల్లో మహిళను గుర్తించినా.. ఇప్పటి వరకూ కిడ్నాపర్‌ను ట్రేస్ చేయలేకపోయారు పోలీసులు. బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు నాలుగు స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఏప్రిల్ 30న కిడ్నాపర్ మహిళ తిరుమలకు వచ్చినట్లు గుర్తించారు. ఈమె తమిళనాడుకు చెందిన మహిళగా పోలీసులు (Police) భావిస్తున్నారు. కాట్పడి రైలులో బాలుడితో కలిసి కిడ్నాపర్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. దాంతో తిరుపతి నుండి ఓ ప్రత్యేక పోలీసు బృందం వేలూరు, కాట్పాడికి బయల్దేరారు. బాలుడి ఆచూకీని కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు. అయితే సీసీ కెమెరాల ద్వారా కొన్ని ఆధారాలు లభించినా.. సదరు కిడ్నాప్ చేసిన మహిళ ఎక్కడుందో గుర్తించలేకపోతున్నారు పోలీసులు. మరోవైపు 72 గంటలు గడుస్తున్నా బాలుడి ఆచూకీ లేకపోవటంతో కన్నతల్లి .. కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన కొడుకును ఎలాగైనా తనకు అప్పజెప్పి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది బాలుడి తల్లి.
కాగా, సోమవారం ఉదయం నుంచి తిరుమల పోలీసులు కిడ్నాపర్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి బాలుడితో కలిసి ఆ మహిళ తిరుపతికి చేరుకుని గోవిందరాజస్వామిని దర్శించుకుంది. తర్వాత విష్ణునివాసంలో బస చేసి సోమవారం వేకువజామున 4.10 నుంచి 4.30 గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లో టికెట్ కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఏ రైలెక్కి.. ఎక్కడికి వెళ్లిందనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నెల్లూరు లేదా కడపకు వెళ్లి ఉండవచ్చు అన్న నిర్ధారణకు వచ్చారు. కిడ్నాపర్ కోసం ఆరు బృందాలుగా ఏర్పడి కొందరు నెల్లూరు, మరికొందరు కడపకు వెళ్లారు. మధ్యలోని రైల్వేస్టేషన్లలోనూ కూడా విచారణ చేపడుతున్నారు. వీటితో పాటు రివర్స్ డైరెక్షన్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే కిడ్నాపర్ 30వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బస్సులో అలిపిరి చెక్‌పాయింట్‌కు చేరుకున్నట్టు ఫుటేజ్‌లో కనిపించింది. ఆ తర్వాత తిరుమలకు చేరుకుని వరాహస్వామి, నాదనీరాజనం మండపం వద్ద బస చేసినట్లు గుర్తించారు.
మరిన్ని తిరుమల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: