ప్రచారం ముగిసింది.. పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి.. కానీ.. ఇదే పెద్ద సవాలు

|

Apr 15, 2021 | 9:01 PM

ప్రచారం ముగిసింది. పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికలకు శనివారం పోలింగ్‌ జరగబోతోంది. ప్రతిష్టాత్మక ఎన్నికకు భారీగా ఏర్పాట్లుచేసింది అధికారయంత్రాంగం.

ప్రచారం ముగిసింది.. పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి.. కానీ.. ఇదే పెద్ద సవాలు
Follow us on

ప్రచారం ముగిసింది. పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికలకు శనివారం పోలింగ్‌ జరగబోతోంది. ప్రతిష్టాత్మక ఎన్నికకు భారీగా ఏర్పాట్లుచేసింది అధికారయంత్రాంగం. ఓ వైపు మండుటెండలు.. మరోవైపు కరోనా తీవ్రత. ఈ సమయంలో జరుగుతున్న తిరుపతి బైపోల్‌ని సవాలుగా తీసుకుంది అధికారయంత్రాంగం. ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భారీగా బలగాలను మోహరిస్తోంది ఎన్నికలకమిషన్‌.

12గంటల పాటు పోలింగ్‌. ప్రత్యేక పరిస్థితులతో ఉదయం 7గంటలనుంచి రాత్రి 7గంటలదాకా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ విధులకు హాజరయ్యేవారిలో 99శాతంమందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించిన అధికారులు.. పోలింగ్‌ కేంద్రాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బూత్‌కి వెయ్యిమంది ఓటర్లకి మించకుండా చర్యలు తీసుకున్నారు.

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 28మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నోటాతో కలిపి మొత్తం 29సింబల్స్‌ కేటాయించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2వేల 470 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేశారు. గతంతో పోల్చుకుంటే 500 బూత్‌లు అదనంగా పెట్టారు. 92శాతం మంది ఓటర్లకు ఓటు స్లిప్పులు అందించామన్నారు రిటర్నింగ్‌ అధికారి, నెల్లూరుజిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు. 18వ తేదీ సాయంత్రం 7గంటలదాకా 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు.

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 80ఏళ్ల పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందుబాటులోకి తెచ్చారు. గోప్యతను పాటిస్తూ మొబైల్‌ పోలింగ్‌ బూత్‌ ద్వారా ఓటేసే ఏర్పాట్లు చేశారు. ఇప్పటిదాకా దాదాపు 7వేల మంది వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకునేందుకు KNOW MY POLLING STATION యాప్ అందుబాటులోకి తెచ్చింది ఎన్నికలసంఘం.

పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నిక కోసం 23 కంపెనీల కేంద్ర బలగాలను దించారు. మూడు బెటాలియన్ల ఏపీఎస్పీ పోలీసులతో పాటు రెండు తెలంగాణ బెటాలియన్లను పోలింగ్‌కోసం మోహరించారు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోకూడదని, వారు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదని ఆదేశాలిచ్చారు. మొత్తం 43 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ పోలింగ్‌ని పర్యవేక్షిస్తాయన్నారు ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌. మొత్తం 466 సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. తిరుపతి, నెల్లూరు డీజీపీ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటుచేశారు. 55 క్విక్ రియాక్షన్ టీమ్స్‌ని నియమించారు.

ఇవి కూడా చదవండి: ED Pulls ESI Scam: జ్యువెలర్స్ షోరూమ్‌లో స్విచ్ వేస్తే.. తెలంగాణ కార్మిక శాఖ పేషీలో లైటు వెలిగింది.. ESI స్కామ్ లో థ్రిల్లర్‌ మూవీ క్లైమాక్స్

 Corona cases: గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ స్పాట్ సెంటర్లు.. తెలంగాణలోని ఆ జల్లాలో పెరుగుతున్న కరోనా విలయతాండవం..