తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. తాజాగా, అలిపిరి నడకమార్గంలో రెండు చిరుతలు కనిపించాయి. వాటిని చూసిన భక్తులు భయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ శబ్ధానికి రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతలు కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు భక్తులు.
అయితే, చిరుతల విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని పరిశీలించారు. అవి వెళ్లిన మార్గంలో.. వాటి జాడలను గుర్తించే పనిలో ఉన్నారు ఫారెస్ట్ సిబ్బంది. చిరుతల సంచారం దృష్ట్యా భక్తులను కొండపైకి గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. నడకదారి భక్తులకు ఎటువంటి అపాయం తలెత్తకుండా అటవీశాఖ అధికారులు అప్రమత్తమై చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో ఓ చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డొచ్చింది. కారు సీసీటీవీ కెమెరాలో చిరుత పులి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతను చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చిరుత రోడ్డు దాటి వెళ్లిపోవడంతో కారులో వెళ్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని పొట్టనపెడ్డుకుంది చిరుత. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. చిరుతకు బలైపోయిన చిన్నారిలా మరొకరి ప్రాణాలకు బలికాక ముందే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..