Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..

టీటీడీ కల్తీ నెయ్యి కథ ఎట్టకేలకు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా చేసింది. 16 నెలల విచారణ 36 మందిని నిందితుల్ని చేసింది. 10కిపైగా రాష్ట్రాల్లో జరిగిన సిట్ ఎంక్వయిరీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పొలిటికల్ గా కూడా హీట్ పుట్టించిన టీటీడీ నెయ్యి కేసు ఎంతో మందిని విచారణ కు పిలిపించింది. నెయ్యి సరఫరాలో పలు రాష్ట్రాల డయిరీల అక్రమాలు, టిటిడి ఉద్యోగుల పాత్రను సిట్ ఛార్జ్ షీట్ బయట పెట్టింది. లుక్

Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
Tirumala Tirupati Laddu Case

Updated on: Jan 24, 2026 | 7:50 AM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ ఎంక్వయిరీ పూర్తయింది. 2024 సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటై విచారణ కొనసాగింది. దాదాపు 16 నెలలపాటు 10 రాష్ట్రాల్లో విచారణ జరగ్గా.. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. ప్రధానంగా.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రైవేట్ PA, A24 చిన్నఅప్పన్న అరెస్ట్‌ తర్వాత సిట్ విచారణ వేగవంతమై ఛార్జ్‌షీట్ వరకు వెళ్లింది. గతేడాది మేలో తొలి ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిన సిట్.. ఇప్పుడు ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతోపాటు.. కీలక అంశాలను చేర్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్, విపిన్‌ జైన్‌లను కీలక సూత్రధారులుగా గుర్తించింది. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ GM, A27గా ఉన్న సుబ్రహ్మణ్యం, A24 చిన్నఅప్పన్న కూడా కీలకమని సిట్ తేల్చింది. వీరిద్దరి స్టేట్‌మెంట్స్‌తోనే కల్తీ నెయ్యి కేసు కొలిక్కి వచ్చినట్లు సిట్‌ వెల్లడించింది. నిందితుల స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఫైనల్ చార్జ్‌సీట్ దాఖలు చేసిన సిట్‌.. అవకతవకలు, లబ్ది పొందినవారి వివరాలను స్పష్టంగా పేర్కొంది. హవాలా ద్వారా చిన్నఅప్పన్నకు రెండుసార్లు 50 లక్షల రూపాయల చొప్పున అందజేసినట్లు ముంబై హవాలా ఏజెంట్ అమన్‌గుప్తా అంగీకరించినట్లు ఆధారాలు సేకరించింది. దీనిలో భాగంగానే.. టీటీడీ ఉన్నతాధికారులు, అప్పటి టీటీడీ చైర్మన్లను విచారించిన సిట్.. చిన్నఅప్పన్న ఆస్తులు, ఆయనకు సహకరించిన వారి వివరాలను కూడా సిట్‌ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది.

ఇదిలావుంటే.. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో 36 మందితో పాటు విచారణకు పిలిచిన టీటీడీ మాజీ చైర్మన్లు, ఈవోల పేర్లు కూడా చార్జ్‌షీట్‌లో ఉంటాయన్న సస్పెన్స్‌కు సిట్ తెర దింపింది. నిందితుల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నేతల పేర్లు ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌లో లేకపోవడంతో రాజకీయ ప్రాధాన్యత లేనట్లేనా అన్న చర్చ జరుగుతోంది. కేవలం టీటీడీలో నెయ్యి ఎలా కల్తీ జరిగింది?.. ఈ కేసులో అసలు దొంగలు ఎవరు?.. ఎవరి పాత్ర ఏంటి?.. అనే అంశాలను మాత్రమే సిట్‌.. ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన బోలె బాబా ఆర్గానిక్ డెయిరీ, తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, ఏపీలోని వైష్ణవి డెయిరీల లాలూచీని బహిర్గతం చేసింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలన్న టార్గెట్‌గా ఏఆర్ డెయిరీతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది.

నకిలీ సీల్స్‌, తప్పుడు జీఎస్టీ బిల్లులు, ల్యాబ్ రిపోర్టులు, వారెంటీ సర్టిఫికెట్లతో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు గుర్తించింది. అర్హత, సామర్థ్యం లేని ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి సరఫరా ప్రయత్నాలను సిట్ గుట్టురట్టు చేసింది. అటు.. ఆయా డెయిరీల నిర్వాహకుల బాగోతాన్ని గతంలోనే రిమాండ్‌ రిపోర్ట్‌లో సిట్ బట్టబయలు చేసింది. మొత్తంగా.. ఇప్పుడు ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌తో తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసింది. రాజకీయ ప్రాధాన్యత లేనట్లేనన్న సంకేతాలతో పొలిటికల్‌ సస్పెన్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడింది. ఫలితంగా.. టీటీడీ మాజీ ఛైర్మన్లు, ఈవోలకు ఈ కేసు నుంచి ఊరట దక్కినట్లు అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..