Tiger Tension in Kakinada: కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసర ప్రాంతాల్లో బెంగాల్ టైగర్ టెన్షన్ తెలుగు డైలీ సీరియల్ లా నెవ్వర్ ఎండింగ్ అంటోంది. అదిగో పులి అని సమాచారం అందుకుని అధికారులు అక్కడికి చేరుకొనేలోపు.. ఇదిగో పట్టుకోండి అంటూ.. మరో ప్రాంతంలో ప్రత్యక్షమవుతుంది. తాజాగా ప్రత్తిపాడులోని రౌతులపూడి మండలం లచ్చిరెడ్డి పాలెం , NN పట్నం గ్రామాల మధ్య పులి సంచరించినట్లు పాదముద్రలు గుర్తించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన అధికారులు సమీప అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలతో పులి వెళ్లే దిశను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
మరోవైపు విశాఖ జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కాకినాడ జిల్లాలో రౌతులపూడి మండలం లో సంచరిస్తున్నపులి.. నర్సీపట్నం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి.. రెండు ఒకటేనా.. లేక రెండు వేరు వేరు పులులా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని పాదముద్రలు సేకరించి.. ఆ పాదముద్రల కొలతలను బట్టి రెండు పులులా? లేక ఒక పులా అనేది ధ్రువీకరించే పనిలో ఉన్నారు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు ఈ బెంగాల్ టైగర్ ను బంధించడానికి అటవీశాఖ అధికారులు చేయని ప్రయత్నాలు లేనట్లు తెలుస్తోంది. దిశలను మార్చుకుంటూ పయనిస్తున్న బెంగాల్ టైగర్.. పయనం ఎటో తెలియక సతమతమవుతున్నారు అటవీశాఖ అధికారులు.. భయం గుప్పిట్లో బతుకున్నారు సమీప గ్రామాల ప్రజలు. బెంగాల్ టైగర్ ను బంధించడానికి అటవీశాఖ అధికారులు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..