Andhra Pradesh: వామ్మో పులి.. దూడ బలి.. భయం గుప్పిట్లో ఆ గ్రామం…
బొమ్మలాపురం పరిసరాల్లో పెద్దపులి దాడులతో ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల తుంగుడులో ఒక దూడను చంపడంతో రైతులు పొలాలకు వెళ్ళడానికి భయపడుతున్నారు. గత మూడేళ్లుగా జరుగుతున్న ఈ దాడులకు అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలతో నిఘా పెట్టినా, రైతులు పులిని పట్టుకోవాలని, తమకు తక్షణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని బొమ్మలాపురం పరిసర ప్రాంతాల ప్రజలు గత కొంతకాలంగా పెద్దపులి భయంతో వణికిపోతున్నారు. తాజాగా తుంగుడు సమీపంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పెద్దపులి దాడి చేసి, ఒక కోడెదూడను హతమార్చడంతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. పదేపదే జరుగుతున్న ఈ దాడుల వల్ల రైతులు, పశువుల కాపరులు పొలాలకు వెళ్లాలంటేనే ప్రాణభయంతో వెనకడుగు వేస్తున్నారు. తుంగుడు ప్రాంతంలో అటవీ సమీపంలో మేత మేస్తున్న ఆవుల మందపై పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. మందలో ఉన్న ఒక కోడెదూడను పులి హతమార్చింది. మిగిలిన పశువులు భయంతో పరుగులు తీయగా పశువుల కాపరులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పులి దాడిలో ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులు చనిపోయాయని వాటి యజమానులు వాపోతున్నారు.
గండి చెరువు వద్ద నిత్య సంచారం
బొమ్మలాపురం సమీపంలోని గండి చెరువు, తుంగుడు ప్రాంతాలే పులి సంచారానికి ప్రధాన కేంద్రంగా మారాయి. అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఉన్న గండిచెరువుకు నీరు తాగేందుకు పులులు వస్తున్నట్లు రైతులు గుర్తించారు. పొలాలకు వెళ్లే దారుల్లో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తుండటం ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది. గత మూడేళ్లుగా బొమ్మలాపురం పరిసరాల్లో ఈ పెద్దపులి సంచరిస్తోందని, మేతకు వచ్చే ఆవుల మందలపై తరచూ దాడులు చేస్తోందని పశువుల కాపరులు చెబుతున్నారు. రైతులు, కాపరులు రాత్రి సమయంలోనే పులి ఎక్కువగా వస్తుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రంగంలోకి ఫారెస్ట్ అధికారులు
గతంలో కనిపించిన పులి పాదముద్రల ఆధారంగా అది ఆడపులిగా ఫారెస్ట్ అధికారులు అంచనాకు వచ్చారు. పులి కదలికలను గుర్తించడం కోసం గతంలోనే సమీపంలోని చెట్లకు ట్రాప్ కెమెరాలను కూడా అమర్చారు. అయితే కొన్నిసార్లు పులి కదలికలు కెమెరాలకు చిక్కకపోవడం వల్ల దాని కచ్చితమైన స్థావరం గురించి అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. తాజాగా పశువులపై దాడి జరిగిన తర్వాత రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి అడుగు జాడలను గుర్తించిన అధికారులు, ఈ ప్రాంతంలో పులి సంచారం వాస్తవమే అని నిర్ధారించారు.
రైతుల డిమాండ్
ప్రస్తుతం ప్రాణభయంతో పొలాలకు వెళ్లడానికి రైతులు వెనుకాడుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని, ప్రధానంగా పులి అడవి దాటి జనావాసాలు లేదా పొలాల వైపు రాకుండా తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పులిని పట్టుకోవడానికి లేదా దానిని అడవిలోకి పంపడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వారు వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
