
న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి.. చిన్నా, పెద్దా.. అంతా కూడా సందడి చేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.. అయితే.. కొన్ని చోట్ల విషాదం చోటుచేసుకుని.. పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ముగ్గురు యువకులు టీ తాగడానికి వెళుతుండగా.. మృత్యువు కబళించింది.. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ ముగ్గురు యువకులు కూడా టీ తాగేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు, స్థానికులు తెలిపారు.
ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని బెస్తవారి పేట మండలం, శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిందని పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. పాపాయిపల్లికి చెందిన పవన్ (20), రాహుల్ (21), శ్రీనివాస్ (21) అనే ముగ్గురు స్నేహితులు.. తెల్లవారుజామున టీ తాగేందుకు ద్విచక్రవాహనంపై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో గిద్దలూరు నుంచి బెస్తవారి పేట వైపు వస్తున్న బొలెరో వాహనం.. అదుపు తప్పి వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..