AP Rajya Sabha: రాజ్యసభకు ముగ్గురు వైసీపీ అభ్యర్థుల నామినేషన్.. ఒకరికి ఏకంగా రూ.475 కోట్ల ఆస్తులు!

|

Feb 14, 2024 | 6:43 PM

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి తోడల్లుడు. సొంతూరు ప్రకాశం జిల్లా మేదరమెట్ల. వైయస్‌ జగన్‌కు కుడి భుజంగా పేరుంది. 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్తానం ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్న వైవీ సుబ్బారెడ్డిని పెద్దల సభకు ఎంపిక చేసింది వైసీపీ హైకమాండ్.

AP Rajya Sabha: రాజ్యసభకు ముగ్గురు వైసీపీ అభ్యర్థుల నామినేషన్.. ఒకరికి ఏకంగా రూ.475 కోట్ల ఆస్తులు!
Ys Jagan, Yv Subbareddy, Golla Baburao, Meda Raghunath Reddy
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలు ఖాళీ అయితే.. మూడింటికి వైసీపీ తరపున అభ్యర్ధులు నామినేషన్ వేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడా రఘునాథ్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక టీడీపీ నుంచి ఎవరూ పోటీలో నిల్చోకపోవడంతో ఈ ముగ్గురి ఎన్నిక ఇక లాంఛనమే. రాజ్యసభ రేసులో నిలబడే ఒక్కో అభ్యర్థికి 44 ఓట్లు కావాలి. కానీ టీడీపీకి అంత బలం లేదు. అందుకే రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపేందుకు టీడీపీ ఆసక్తి చూపడం లేదు.

గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు మంత్రదండం పనిచేసి.. టీడీపీ అనూహ్య విజయం సాధించింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలంగా లేదని, 24 మంది క్రాస్ ఓటింగ్ చేసే ఛాన్స్ లేదని పార్టీ భావిస్తోంది. అందుకే.. ఈసారికి రాజ్యసభ ఎన్నికల వైపు చూడనే వద్దని భావిస్తున్నారు టీడీపీ అధినేత. సో.. మూడు పెద్ద కుర్చీలు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి.

అయితే వైసీపీ తరుఫున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డిల జీవిత విశేషాలు ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీరిలో ఇద్దరికి భారీగా ఆస్తులు ఉండగా.. ఒకరికి మాత్రం భారీగా ఆస్తులు లేవు. ఈ ముగ్గురు నామినేషన్‌తోపాటు, ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజ్యసభకు వెళ్లే ముగ్గురు అభ్యర్థుల ప్రొపైల్స్ ఓసారి చూద్దాం..

వైవీ సుబ్బారెడ్డి.

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి తోడల్లుడు. సొంతూరు ప్రకాశం జిల్లా మేదరమెట్ల. వైయస్‌ జగన్‌కు కుడి భుజంగా పేరుంది. 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్తానం ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్న వైవీ సుబ్బారెడ్డిని పెద్దల సభకు ఎంపిక చేసింది వైసీపీ హైకమాండ్.

వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి కలిపి స్థిర, చరాస్తులు మొత్తం రూ.118 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి పేరుతో రూ.33.39 కోట్లు, ఆయన భార్య పేరిట రూ.3.67 కోట్లు చరాస్తులు ఉన్నాయి. ఇక వాహనా విషయానికి వస్తే బీవైడీ కారు విలువ రూ.24 లక్షలు, బీవైడీ ఏటీటీ రూ.35.81 లక్షలు, లెక్సస్‌ కారు రూ.1.07 కోట్లు, ఇన్నోవా క్రిస్టా, హోండా మొబిలో, డస్టర్‌ కార్లున్నాయి. స్థిరాస్తి విషయానికి వస్తే.. వైవీతో పాటు ఆయన భార్య పేరుతో రూ.81.11 కోట్ల విలువై స్థిరాస్తులున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే-ఎంపీ కాలనీలో 500 చదరపు గజాల్లో 4,500 చదరపు అడుగుల ఇల్లు ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ రూ.3.40 కోట్లుగా చూపించారు.

వైవీ దగ్గర రూ.48.28 లక్షలు.. ఆయన భార్య వద్ద రూ.1.95 కోట్ల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. వైవీకి అప్పులు రూ.29.9 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. వైవీ సుబ్బారెడ్డిపై ఈడీ, సీబీఐ కేసులున్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద 2011లో ఈడీ పెట్టిన కేసు, 2011లో ఐపీసీ 120-బి, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌-9 కింద సీబీఐ నమోదు చేసిన మరో కేసు ఉంది. 2014లో ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మొత్తంగా సుబ్బారెడ్డిపై 3 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

గొల్ల బాబూరావు..

గ్రూప్-1 స్థాయి అధికారి. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ, జబల్‌పూర్‌లో ఎంఏ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 2009లో కాంగ్రెస్‌లో చేరారు. 2011లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన గొల్ల బాబూరావును తొలిసారిగా రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ.

బాబూరావు కు మొత్తం చరాస్తి విలువ రూ.4.19 కోట్లు. స్థిరాస్తి విలువ రూ.5.75 కోట్లుగా అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడులో రెండు వేర్వేరు సర్వే నెంబర్లలో కలిపి 1.94 ఎకరాల భూమి. గవరవరంలో 209 చదరపు గజాల ఖాళీ స్థలం, తంగెళ్లమూడిలో 1114 చ.గ. స్థలాలు ఉన్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో 2,180 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు, అమలాపురం పరిధిలోని కమనగరువు గ్రామంలో 1,900 చదరపు అడుగుల ఇల్లు, కొవ్వలి గ్రామంలో 1,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో ఇల్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక వాహనాల విషయానికి వస్తే.. రెండు కార్లు, ప్రత్యేకించి ఆయన పేరు మీద హోండా స్కూటర్‌ మాత్రమే ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మేడా రఘునాథ్‌రెడ్డి

రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడైన మేడా రఘునాథరెడ్డి. ఆయన పదో తరగతి తర్వాత ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీలో చేరి, మధ్యలోనే ఆపేశారు. వ్యాపారంలో దిట్ట అయినప్పటికీ రాజకీయాలకు పూర్తిగా కొత్త రఘునాథ్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రాజ్యసభ ఛాన్స్ దక్కించుకుంటున్నారు. రఘునాథరెడ్డి, ఆయన ఇద్దరు కుమారులతో కలిపి రూ.475 కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో ఆయన ఒక్కడి పేరిటే రూ.385 కోట్లు. ఆయన కుమారుల పేరిట రూ.82 కోట్ల అప్పులున్నాయి. రఘునాథరెడ్డి పేరిట ఒక్క కారు కూడా లేకపోవడం విశేషం.

రఘునాథరెడ్డి పేరుతో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేగూరు, షాబాద్‌లో, కడప జిల్లాలో మొత్తం 34 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఇళ్లస్థలాలున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు చేస్తున్నారు రఘునాథరెడ్డి. బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు కడపలో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు చేస్తున్నారు. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులూ పెండింగ్‌లో లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.మొత్తంగా చూసుకుంటే.. ఇటు తెలంగాణలో.. అటు ఏపీలో రాజ్యసభకు పోటీ లేకుండానే ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…