CBN-Vijayasai Reddy: చంద్రబాబుకు, విజయసాయి రెడ్డికి నిజంగానే బంధుత్వం.. ఎలాగంటే..?

|

Jul 16, 2022 | 6:00 PM

‘చంద్రబాబు వరుసకు నాకు అన్న.. నా బంధువుల కంపెనీలన్నీ నావే అయితే హెరిటేజ్ కూడా నాదే’ అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ సాయి రెడ్డి. దీంట్లో పొలిటికల్ వార్ పక్కనబెడితే.. ఇరువురి మధ్య నిజంగానే బంధుత్వం ఉందా..?

CBN-Vijayasai Reddy: చంద్రబాబుకు, విజయసాయి రెడ్డికి నిజంగానే బంధుత్వం.. ఎలాగంటే..?
Vijaysai Chandrababu
Follow us on

Andhra Pradesh: చంద్రబాబుతో చుట్టరికం కలిపారు విజయసాయిరెడ్డి. తనకు ఆయన అన్నయ్య అవుతారని చెప్పారు. అంతమాత్రాన చంద్రబాబు ఆస్తులన్నీ తన ఆస్తులైపోవని సెటైర్లు కూడా వేశారు. మద్యం సరఫరాలో అదాన్‌ డిస్టలరీస్‌ కంపెనీకి, తన కుటుంబానికి లింక్‌ పెట్టి టీడీపీ చేస్తున్న ఆరోపణలను కౌంటర్‌ ఇస్తూనే చాలా బిజినెస్‌ వ్యవహారాలను ప్రస్తావించారు విజయసాయిరెడ్డి.  వీరి మధ్య నడుస్తోన్న ఈ పొలిటికల్ వార్ పక్కన పెడితే.  ఈ ఇద్దరు నాయకులు నిజంగా బంధువులు అవుతారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఆ విషయంపై విజయసాయిరెడ్డే క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తనకు నిజంగానే బంధువు అవుతాడని వెల్లడించారు. చంద్రబాబు వరుసకు తనకు అన్న అవుతాడని స్పష్టం చేశారు. అది ఎలా అంటే…. ఎన్టీఆర్‌(NTR) మనవడు తారకరత్న(నందమూరి మోహన కృష్ణ తనయుడు)… తన భార్య సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. ఆ రకంగా చంద్రబాబు తనకు అన్న అవుతారని వివరించారు. అలా బంధువు అయినంత మాత్రాన నా ఆస్తులు ఆయనవి, చంద్రబాబు ఆస్తులు నావి అయిపోతాయా? హెరిటేజ్‌, అరబిందో ఒకటైపోతుందా? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. తారక రత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి. ఈమెను 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు తారకతర్న. ఈ దంపతులకు నిష్క(Nishka) అనే కుమార్తె ఉంది.

ఇక పొలిటికల్ వార్ విషయానికి వస్తే…

కల్తీ మద్యం విక్రయాలు అంటూ ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకి కౌంటర్‌ ఇచ్చేప్రయత్నం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అదాన్‌ డిస్టలరీస్‌ కంపెనీలో తన అల్లుడికి వాటాలు ఉన్నాయని, అది వారి బినామీ కంపెనీనే టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలకు సుదీర్ఘంగా కౌంటర్‌ ఇచ్చారు విజయసాయిరెడ్డి. కామన్‌ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి పని చేసే కంపెనీలన్నీ ఒకరివే కావన్నారు. అదే నిజమైతే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉన్న కంపెనీలకు అది పని వర్తిస్తుందన్నారు. నారా భువనేశ్వరి డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల్లో చాలా మంది డైరెక్టర్లుగా ఉన్నారని, వారు వేరే కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా పని చేస్తున్నారని చెప్పారు. వాళ్లు పని చేస్తున్న కంపెనీలు కూడా నారా కుటుంబానివేనా అని ప్రశ్నించారు. టీడీపీ ఆరోపణలు చేస్తున్న అదాన్‌ డిస్టలరీస్‌ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఆ కంపెనీలో పని చేస్తున్న డైరెక్టర్లు ఎవరో కూడా తెలియదన్నారు. మరోవైపు హెరిటేజ్‌ పాల శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపామన్నారు విజయసాయిరెడ్డి. ఆ పాలపై తమిళనాడు, కేరళలో నిషేధం ఉందని, ఇక్కడా పరీక్షలకు పంపామని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..