పినాకిని ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు పెడుతోంది… చెన్నై నుంచి బయలుదేరిన రైలు విజయవాడ గమ్యానికి ప్రయాణీకులను చేర్చేందుకు ఎప్పటిలాగే వేగంగా దూసుకెళుతోంది. యంత్రం వేళ వాతావరణం ఆహ్లదకరంగా ఉంది… కొందరు ప్రయాణీకులు సీట్లలో కూర్చుని కునికిపాట్లు పడుతుంటే మరికొందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో చెన్నై నుంచి చీరాలకు బంధువుల ఇంటికి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ నడివయసు మహిళతో అదే రైల్లో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మాటలు కలిపారు.
మంచిగా మాట్లాడుతూ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు… ఆ మహిళ స్పృహ తప్పగానే ఒంటిపై, బ్యాగులో ఉన్న పది లక్షల విలువైన నగలతో ఉడాయించారు. రైల్లో ప్రయాణికుల ముసుగులో ఓ మహిళా ప్రయాణీకురాలికి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి ఆపై అందిన కాడికి దోచుకొన్ని పరారైన ఘటన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే పినాకిని ఎక్సప్రెస్ లో వెలుగు చూసింది.
బాధితుల వివరాల మేరకు చెన్నైకి చెందిన అనురాధ అనే మహిళ చెన్నై నుంచి పినాకిని ఎక్స్ప్రెస్ లో పర్చూరు లోని బంధువుల ఇంటికి పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు బయలుదేరింది. రైలు నెల్లూరు సమీపంలోకి వచ్చాక ప్రయాణికుల ముసుగులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెకు జ్యూస్ లో మత్తుమందు కలిపి పక్కా ప్రణాళిక ప్రకారం ఆమెకు అందించారు.
జ్యూస్ తాగిన కొద్దిసేపటికే ఆమె మైకంలోకి వెళ్లడంతో ఆమె ఒంటిపైన, బ్యాగులో ఉన్న సుమారు రూ. 10 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలను అపహరించారు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైలు ఒంగోలు సమీపానికి వచ్చే సరికి మత్తు నుంచి కొంతమేర తేరుకున్న బాధిత మహిళ అనురాధ తన బ్యాగును, ఒంటి పై నగలను చూసుకుంది.
నగలు లేకపోవడంతో కంగారుపడిన మహిళ పక్కనే కూర్చున్న వ్యక్తుల గురించి ఆరా తీసింది. అయితే ఆ ముగ్గురు యువకులు, తన బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళన గురైంది. చీరాల వచ్చేసరికి మత్తు మందు ప్రభావంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే కూలీలు అతి కష్టం మీద ఆమెను రైలు నుంచి కిందకు దింపి చికిత్స నిమిత్తం 108లో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..