Theives Hulchul In Ongole: బ్యాంకు ఉద్యోగులమంటూ ఇంట్లోకి చొరబడి.. ఒంటరి మహిళకు టోకరా ఇచ్చిన కేటుగాళ్లు..

|

Dec 16, 2020 | 10:24 PM

‌ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో దొంగలు బరి తెగించారు. మారుతీ నగర్‌లో ఓ వృద్ద మహిళపై దాడి చేసి ఒంటిపై ఉన్న 5 లక్షల విలువైన బంగారు...

Theives Hulchul In Ongole: బ్యాంకు ఉద్యోగులమంటూ ఇంట్లోకి చొరబడి.. ఒంటరి మహిళకు టోకరా ఇచ్చిన కేటుగాళ్లు..
Follow us on

Theives Stolen Gold In Ongole: ‌ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో దొంగలు బరి తెగించారు. మారుతీ నగర్‌లో ఓ వృద్ద మహిళపై దాడి చేసి ఒంటిపై ఉన్న 5 లక్షల విలువైన బంగారు నగలను నిలువు దోపిడీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మారుతీ నగర్‌లో 70 ఏళ్ళ వృద్ద మహిళ కంచర్ల మహాలక్ష్మమ్మ నివాసం ఉంటోంది. టీచర్‌గా పనిచేసి రిటైరయిన భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. తన ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక పోర్షన్‌ను అద్దెకు ఇచ్చే ఉద్దేశ్యంతో టూలెట్‌ బోర్డు పెట్టింది.

దీన్ని అవకాశంగా తీసుకున్న ఇద్దరు దొంగలు ఆ వృద్ద మహిళ ఇంట్లో చోరీ చేసేందుకు పక్కా ప్లాన్‌ రచించారు. ఆమె ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించారు. ఇల్లు అద్దెకు కావాలని వృద్దురాలిని అడిగి లోపలికి ప్రవేశించారు. తాము బ్యాంక్‌లో పనిచేస్తున్నామని ఆమెను నమ్మబలికారు. ఇల్లు చూపించేందుకు అమె వారిని ఇంట్లోకి అనుమతించగానే ఆమెపై దాడి చేసి కుర్చీకి కట్టేశారు. ఆమె చేతికి ఉన్న రెండు బంగారు గాజులు, మెడలోని రెండు బంగారు చైన్లు తీసుకుని ఉడాయించారు.

కొద్దిసేపటికి ఆమె తేరుకుని కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆమె కట్లు విప్పారు. తనపై ఇద్దరు యువకులు దాడి చేసి కట్టేసి ఒంటిపై నగలు ఎత్తుకెళ్ళారని వృద్దురాలు బావురుమనడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.