
కోళ్ల పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గుడ్డు ధర దారుణంగా పడిపోవడంతో కోళ్ల ఫారాలను మూసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటున్నారు తూర్పుగోదావరి జిల్లా ఫౌల్ట్రీ ఓనర్స్. ఒకవైపు గుడ్డు రేటు పడిపోవడం, మరోవైపు దాణా రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఫౌల్ట్రీలను నడపడం కష్టంగా మారిందంటున్నారు. గతంలో నేక్ నిర్ణయించిన ధర మేరకు ఫౌల్ట్రీల నుంచి గుడ్లు కొనుగోలు చేసేవారని, కానీ ఇప్పుడు దళారీ వ్యవస్థ తమను నిలువు దోపిడీ చేస్తోందని వాపోతున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 150కి పైగా ఫౌల్ట్రీస్ ఉండగా, సుమారు 150కోట్ల కోళ్లను పెంచుతూ కోటీ 30లక్షల గుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతిరోజూ జిల్లా నుంచి 50 నుంచి 60 లారీల గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయ్. అయితే, కోడి గుడ్డు ధరను నిర్ణయించే అవకాశం ఫౌల్ట్రీ నిర్వాహకులకు లేకపోవడంతో కష్టాలను ఎదుర్కొంటున్నారు. దళారీలు నిర్ణయించిన రేటుకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండటంతో నష్టాలు వస్తున్నాయంటున్నారు నిర్వాహకులు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే కోళ్ల ఫారాలను మూసుకోవాల్సి వస్తుందంటున్నారు రైతులు. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తేనే కోళ్ల పరిశ్రమ బతికిబట్టకడుతుందని చెబుతున్నారు. కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు నెక్ బోర్డును ఏర్పాటుచేసి రాయితీలు అందించాలని కోరుతోంది ఫౌల్ట్రీ ఫెడరేషన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..