Andhra Pradesh: సీఎంఓ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.. స్పష్టతనిచ్చిన ప్రభుత్వం.. అసలేం జరిగిందంటే..

|

Nov 02, 2022 | 5:52 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర ఆత్మహత్యాయత్నం పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అన్నవరం, అమలాపురంలో తనకు చెందిన...

Andhra Pradesh: సీఎంఓ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.. స్పష్టతనిచ్చిన ప్రభుత్వం.. అసలేం జరిగిందంటే..
AP CMO
Follow us on

ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర ఆత్మహత్యాయత్నం పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అన్నవరం, అమలాపురంలో తనకు చెందిన భూములు ఉన్నాయని, అన్నవరం సమీపంలో ఉన్న స్థలాన్ని అమ్మకోనీయకుండా అడ్డుపడుతున్నారంటూ స్పందన ద్వారా సెప్టెంబరు 12న కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న కాకినాడ ఎస్పీ.. సెప్టెంబరు 14న శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను గన్‌మెన్‌గా, ఇంటిలిజెన్స్‌ విభాగం నుంచి తొలగించి వారికి ఏఆర్‌కు పంపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే.. తమపై తీసుకుంటున్న చర్యలను ఆపాలంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 30న న్యాయస్థానం 8 వారాలు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

కాగా.. బాధితురాలు ఆరుద్ర భర్త భువనేశ్వర్ వారి తల్లిదండ్రులకు ఐదో సంతానం. అతని తండ్రి వైకుంఠ రావు చనిపోయే ముందు వీలునామా రాశారు. దాని ద్వారా పొందిన హక్కుతో వైకుంఠ రావు భార్య సీతమ్మ మరో వీలునామా రాశారు. దాని ప్రకారం ఐదో సంతానమైన భువనేశ్వర్.. తాను ఇచ్చిన ఆస్తిని ఉన్నంత కాలం అనుభవించవచ్చు కానీ అమ్మరాదని ఉంది. అతని తదనంతరం తన నాలుగో కుమారుడైన సోమశేఖర్ కుమారుడైన భరత్ కుమార్ కు చెందేలా వీలు కల్పించారు. అయితే.. భువనేశ్వర్ కుమార్తె సాయిలక్ష్మీ అనారోగ్యానికి గురైంది. ఆమెకు వైద్యం చేయించేందుకు ఆస్తిని అమ్మే ప్రయత్నం చేయగా భరత్ కుమార్ అమలాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు.

ఈ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్ కు ఆరుద్ర సెప్టెంబరు 26న స్పందనలో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని, విచారణ చేపట్టగా ఈ విషయం సివిల్ తగాదాగా గుర్తించారు. కాగా.. ఈ విషయాన్ని బుధవారం ఉదయం సీఎంఓ అధికారులను కలిసిన సమయంలో వివరించేందుకు ప్రయత్నించింది. అధికారులు అడ్డుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. బ్లేడుతో చేతి మణికట్టును కోసుకుంది. అచేతన స్థితిలో ఉన్న కుమార్తెను కాపాడాలని వేడుకునేందుకు వచ్చానని, ముఖ్యమంత్రి ని కలవాలని భావిస్తుంటే తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..