Andhra Pradesh: 20 నెలల తర్వాత వీడిన మర్డర్ కేసు మిస్టరీ.. నిందితులను పట్టించిన డోర్ కర్టెన్

| Edited By: Velpula Bharath Rao

Nov 13, 2024 | 10:09 PM

20 నెలల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు చిన్న క్లూతో ఛేదించారు. ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో హత్య చేసి.. సత్య సాయి జిల్లా మడకశిర మండలం కోడిగానిపల్లి శివారులోని చెట్ల పొదల్లో శవాన్ని పడేసి హంతకులు పరారయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో మిస్సింగ్ కేసు నమోదు చేస్తే.. మడకశిర పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. 20 నెలలు గడిచినా పోలీసులకు చిన్న ఆధారం కూడా దొరకలేదు. చివరకు ఓ డోర్ కర్టెన్ క్లూ ఆధారంగా 20 నెలల క్రితం జరిగిన మర్డర్ మిస్టరీని మడకశిర పోలీసులు ఛేదించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మృతుడి భార్య, ప్రియుడే హంతకులు..

Andhra Pradesh: 20 నెలల తర్వాత వీడిన మర్డర్ కేసు మిస్టరీ.. నిందితులను పట్టించిన డోర్ కర్టెన్
The Door Curtain That Caught The Accused In The Murder Case In Sathya Sai
Follow us on

నేరం చేసిన వారు ఎక్కువ రోజులు తప్పించుకుని తిరగలేరు అన్న దానికి మడకశిర మర్డర్ కేసు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మోహన్ కుమార్.. కర్ణాటక రాష్ట్రం తుంకూరుకు చెందిన మోహన్ కుమార్ 2023 జనవరిలో హత్యకు గురయ్యాడు. సరిగ్గా 20 నెలల తర్వాత మోహన్ కుమార్ హత్య కేసు మిస్టరీని సత్యసాయి జిల్లా మడకశిర పోలీసులు ఛేదించారు. తుంకూరుకు చెందిన మోహన్ కుమార్ భార్య కవిత, కుమారుడు, కూతురుతో జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు, మనస్పర్ధలు రావడంతో.. భార్య కవిత.. భర్త మోహన్ కుమార్ ను వదిలేసి.. పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. తుంకూరులోనే ఒక టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ భార్య కవిత పిల్లల్ని పోషించుకుంటుంది. భర్తను వదిలేసిన భార్య కవిత తుంకూరులోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అక్తర్ పాషాతో సన్నిహితం కాస్త.. వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను వదిలేసి వెళ్లిపోయిన భార్య కవితపై కక్ష పెంచుకున్న భర్త మోహన్ కుమార్ హోటల్ దగ్గరికి వచ్చి కూడా నిత్యం గొడవపడటం మొదలుపెట్టాడు. అలాగే భార్య కవితను భర్త మోహన్ కుమార్ తాగొచ్చి కొట్టేవాడు.

దీంతో భార్య కవిత ఎలాగైనా భర్త మోహన్ కుమార్ అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు అక్తర్ పాషతో స్కెచ్ వేసింది. హోటల్ కి వచ్చిన భర్త మోహన్ కుమార్‌కు భార్య కవిత మాయమాటలు చెప్పి బిర్యానీలో మత్తు మందు కలిపింది. మత్తులో ఉన్న మోహన్ కుమార్‌ను భార్య కవిత.. కుమారుడు కౌశిక్.. హోటల్లో పనిచేసే మరో వ్యక్తి రంగనాథ్ తో కలిసి కత్తితో గొంతు కోసి హత్య చేశారు. రక్తం కారుతున్న మోహన్ కుమార్ డెడ్ బాడీని కనపడకుండా ఉండేందుకు డోర్ కి ఉన్న కర్టెన్ తీసి.. డెడ్ బాడీకి చుట్టి కారులో తీసుకెళ్లారు. తుంకూరు నుంచి సత్యసాయి జిల్లా కోడిగానిపల్లి గ్రామ శివారులోని చెట్ల పొదల్లో పడేశారు. మృతుడు మోహన్ కుమార్ తల్లి ఫిర్యాదుతో తుంకూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అలాగే ఇటు మడకశిర పోలీసులు కూడా హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్య జరిగిన రెండు రోజులకే మోహన్ కుమార్ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడిన.. హత్య కేసు మిస్టరీ వీడలేదు. దీంతో 20 నెలలుగా మడకశిర పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఎలాంటి ఆధారం దొరకలేదు. భర్తను హత్య చేసి… ఏమీ ఎరగనట్లు భార్య కవిత పోలీసులకు అనుమానం రాకుండా మేనేజ్ చేయగలిగింది. వాస్తవానికి పోలీసులకు కూడా భార్య కవితపై ఎలాంటి అనుమానం రాలేదు. మోహన్ కుమార్ హత్య జరిగి 20 నెలలు గడిచిన హత్య కేసు మిస్టరీ వీడకపోవడంతో.. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు.

హత్య కేసు విచారణలో భాగంగా పలుమార్లు తుంకూరులోని భార్య కవిత నడుపుతున్న హోటల్ కు పోలీసులు వెళ్లారు. అయితే ఇటీవల విచారణలో భాగంగా కానిస్టేబుల్ నవీన్.. హెడ్ కానిస్టేబుల్ విజయ్ కృష్ణ తుంకూరులోని భార్య కవిత నడిపిస్తున్న హోటల్ కి వెళ్ళినప్పుడు.. అక్కడ తలుపుకు ఉన్న కర్టెన్ ను గమనించారు. కవిత నడిపిస్తున్న టిఫిన్ సెంటర్ డోర్ కు ఉన్న కర్టెన్.. మోహన్ కుమార్ మృతదేహానికి చుట్టిన కర్టెన్ ఒకేలా ఉండడంతో పోలీసులకు భార్య కవితపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్ లో భార్య కవితలు విచారించగా అసలు విషయం బయటపడింది. భర్త మోహన్ కుమార్ వేధింపులు తట్టుకోలేక.. భార్య కవిత ప్రియుడు అక్తర్ పాషాతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో 20 నెలలుగా వీడని మోహన్ కుమార్ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు మడకశిర పోలీసులు ఛేదించారు. ఒక చిన్న క్లూ తో చాకచక్యంగా. భార్య, ప్రియుడి బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. డోర్ కర్టెన్ నిందితులను పట్టించింది. అందుకే “కానూన్ కే హాథ్ బహుత్ లంబే హోతే హై” అంటారు… అంటే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అర్థం. ఎంతటి నేరస్తుడైనా కంగారులో చిన్న క్లూ అయినా వదిలి వెళ్ళిపోతాడు అన్న దానికి మోహన్ కుమార్ హత్య కేసు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి