JD Vance Millets Picture: వారెవ్వా.. ఏం టాలెంట్ గురూ..మిల్లెట్స్‌తో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌ దంపతుల చిత్రం..

| Edited By: Ravi Kiran

Nov 16, 2024 | 7:15 AM

అగ్రరాజ్యం అమెరికా నూతన పాలనలో అధ్యక్షుడి తర్వాత కీలకంగా మారబోతున్న చిలుకూరి ఉష, వ్యాన్స్ దంపతుల కోసం ఓ 'చిరు' చిత్రకారుడు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. తెలుగింటి ఆడపడుచు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం.. తెలుగింటి అల్లుడు ఉపాధ్యక్షుడు కానుండడంతో.. ఉష దంపతుల అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించాడు. అది కూడా కలర్స్ తో కాదు..కేవలం చిరుధాన్యాలతోనే..!

JD Vance Millets Picture: వారెవ్వా.. ఏం టాలెంట్ గురూ..మిల్లెట్స్‌తో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌ దంపతుల చిత్రం..
Picture Of Us Vice President Jd Vance With Millets
Follow us on

ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదే క్రమంలో తెలుగింటి అల్లుడైన జేమ్స్ డేవిడ్ వ్యాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే జెడి వాన్స్ భార్య ఉష మన తెలుగు ఇంటి అమ్మాయి. ఉష చిలుకూరి తల్లిదండ్రులు కృష్ణా జిల్లాకు చెందినవారు. చదువుకునే రోజుల్లోనే వ్యాన్స్ ఉష ఒకరినొకరు ప్రేమించుకుని అమెరికాలో ఉన్నప్పటికీ హిందూ సంప్రదాయ ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు కీలక సలహాదారుగా ఉన్నారు ఉష చిలుకూరి.. తెలుగు ప్రజల ఓట్లను ఆకర్షించడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. ఆ విషయం స్వయంగా డోనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు.

విశాఖకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్.. చిరుధాన్యాలతో కళారూపాలు చేయడం హాబీగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే హెల్త్ ఆర్ట్ పేరుతో ప్రముఖుల చిత్రాలు, సామాజిక స్పృహను కలిగించే కళారూపాలు చేశాడు. చిరుధాన్యాల ప్రాముఖ్యత చిత్రకళ రూపంలో ప్రపంచ దేశాలకు వివరిస్తున్నాడు. అయితే.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని నమ్మకంతో అతని చిత్రపటాన్ని మిల్లెట్స్ తో తయారు చేశారు. ఇప్పుడు ఆ అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన అద్వితీయ దంపతులు ఉష చిలుకూరి, కాబోయే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చిత్రపటాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. అది కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయ ఆహారంలో భాగమైన చిరుధాన్యాలతో చేయడం విశేషం.

ఈ చిత్రం కోసం ఆరు రకాల మిల్లెట్స్ ను వినియోగించారు. స్కిన్ టోన్, ఆర్ట్ షేడ్ కు అనుగుణంగా అరికెలు, కొర్రలు, సామలు నల్ల సామలు, అంటు కొర్రలతో నేచురల్ కలరింగ్ చేశాడు. దగ్గర నుంచి చూస్తే గాని.. ఆ చిత్రం చిరుధాన్యాలతో చేసినట్టు అనిపించదు. ఎందుకంటే అంతలా తన ప్రతిభ అంతటినీ జోడించి కళారూపానికి జీవం పోశాడు. రెండు అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు కలిగిన ఈ చిత్రాన్ని సిద్ధం చేసేందుకు దాదాపు 12 రోజుల సమయం పట్టిందని విజయ్ కుమార్ తెలిపాడు. ట్రంప్ దంపతుల చిత్రపటాన్ని కూడా రూపొందిస్తున్నాడు ఈ ఆర్టిస్ట్. మన సంస్కృతి సాంప్రదాయాలను ఆహారాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ చిత్రపటాలను అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్ష కుటుంబాలకు అందజేయాలని అనుకుంటున్నట్లు విజయ్ కుమార్ తెలిపాడు. ఆ అవకాశం లేకపోతే.. అమెరికా తెలుగు సంఘాల సహకారంతో అపాయింట్మెంట్ తీసుకొని ట్రంప్ వ్యాన్ ఫ్యామిలీలకు ఈ చిత్రాన్ని బహుకరిస్తానని అతడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి