Puramithra App: ఒక్క క్లిక్‌తో మీ సమస్య ప్రభుత్వం దృష్టికి.. మీ ఇంటికే అధికారులు.. యాప్ వచ్చేసింది
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పురమిత్ర పేరుతో కూటమి ప్రభుత్వం ఓ యాప్‌ను గతంలో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఈ యాప్‌లో పలు మార్పులు చేశారు. ఇక నుంచి ప్రజలు సమస్యలు మరింత త్వరగా పరిష్కారం కానున్నాయి.
ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం పురమిత్ర యాప్‌ను గతంలో తీసుకొచ్చింది. ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుని ప్రజలు ఫొటోలతో సహా తమ సమస్యను అప్లోడ్ చేయవచ్చు. ప్రభుత్వ వీలైనంత త్వరగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
అధికారులు సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ యాప్‌కి సంబంధించి ఏపీ ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఒక ప్రాంతంలో ఒకే అంశంపై ఐదుకిపైగా ఫిర్యాదులు వస్తే మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో ఆరెంజ్ కలర్ హాట్స్పాట్లుగా కనిపిస్తాయి. వీటిని పరిష్కరించడానికి అధికారులు తమ క్షేత్రస్ధాయి పర్యటనల్లో హై ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక సమస్యపై ఏదైనా ప్రాంతంలో ఐదుకిపైగా ఫిర్యాదులు వస్తే అవి కమిషనర్ల దృష్టికి ఆటోమేటిక్‌గా వెళ్తాయి. కమిషనర్ల లాగిన్స్‌లో అవి హాట్స్పాట్లుగా కనిపించడం వల్ల వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. నగరపాలక, మున్సిపల్, నగర పంచాయితీల కమిషనర్ల లాగిన్స్‌లో ఈ కొత్త మార్పు కనిపించనుంది.
ఇలా ఒకే సమస్యపై ఐదు మందికిపైగా ఫిర్యాదు చేసినప్పుడు అది హాట్‌స్పాట్‌గా యాప్‌లో కనిపించడం వల్ల అక్కడ సమస్య తీవ్రంగా ఉందని అధికారులకు అర్థమవుతుంది. దీని వల్ల అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు. దీని వల్ల ప్రజల సమస్యకు కూడా వెంటనే పరిష్కారం లభిస్తుంది.
అంతేకాకుండా అధికారులందరూ కలిసి సమస్యను పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ సమస్యను పరిష్కరించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించినట్లు యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేయాలి. స్ట్రీట్ లైట్స్, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య, కుక్కలు, దోమల బెడద వంటి సమస్యలను కమిషనర్ల స్థాయిలోనే పరిష్కరించాలి.