Vizianagaram: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎస్సై వీరంగం.. ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి

విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఏఆర్ ఏఎస్సై సోమేశ్వరరావుకి, ఆసుపత్రి ల్యాబ్ అసిస్టెంట్ భాగ్యరావుకి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో గొడవ చోటుచేసుకోగా.. అది కాస్త ముదిరి తారాస్థాయికి చేరుకుంది. అసిస్టెంట్‌పై ఏఎస్సై దాడికి దిగడంతో ఉద్రిక్తత రేగింది.

Vizianagaram: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎస్సై వీరంగం.. ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి
Vizianagaram

Edited By:

Updated on: Jul 04, 2026 | 9:07 PM

విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఆర్ ఏఎస్సై సోమేశ్వరరావుకి, ఆసుపత్రి ల్యాబ్ అసిస్టెంట్ భాగ్యరావుకి మధ్య పార్కింగ్ విషయంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా ముదిరి సోమేశ్వరరావు ల్యాబ్ అసిస్టెంట్ పై దాడికి దిగాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైద్యులపైనా సోమేశ్వరరావు దురుసుగా ప్రవర్తించాడు. వివాదం సమయంలో ఏఎస్సై సోమేశ్వరరావు తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను పోలీసు అధికారినని చెబుతూ ఆసుపత్రి సిబ్బందిని బెదిరించినట్లు సిబ్బంది చెప్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యులు,సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

పోలీసులకు వైద్యులు ఫిర్యాదు

ఈ ఘటన అనంతరం వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఏఎస్సై మద్యం సేవించి ఉన్నారనే అనుమానంతో ఆయనకు ఆల్కహాల్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. పోలీసులు సోమేశ్వరరావును అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. అయితే సోమేశ్వరరావు మాత్రం తానేమీ తప్పు చేయలేదని, ఎవరి పై దాడికి పాల్పడలేదని చెప్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us