కరోనాసురుడు మళ్లీ తెగబడ్డాడు. దేశవ్యాప్తంగా కోవిడ్ తాలూకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరగడం, మరణాలు నమోదవ్వడం.. మూడేళ్ల కిందటి పీడకలను మళ్లీ గుర్తు చేస్తోంది. జెఎన్1 పేరుతో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తొలి కేసు కేరళలో బైటపడింది. దీంతో బీ అలర్ట్ అంటున్నాయి తెలుగు రాష్ట్రాలు.. కోవిడ్ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపడం మొదలైంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నియంత్రణ చర్యల్లో బిజీ అయ్యాయి. కేరళ. కర్నాటక రాష్ట్రాలు పూర్తిగా ఎటెన్షన్‌మోడ్‌లోకొచ్చేశాయి. ఇవాళ కర్నాటకలో కోవిడ్ బారిన పడి మరొకరు మృతిచెందారు. బీహార్, ఒడిషా రాష్ట్రాల్లో మృతుల సంఖ్యపై తర్జన భర్జన నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ అలారమ్ మోగుతోంది.
కేంద్రం అలెర్ట్ నోటీస్‌తో అప్రమత్తమైంది తెలంగాణ వైద్య శాఖ. ఆసుపత్రుల సూపరిండెంట్లకు ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయి. మాస్క్, కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 50 పడకలతో ప్రత్యేక కరోనా వార్డ్ ఏర్పాటైంది.
అటు ఏపీలో కూడా అన్నీ ప్రధాన ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని సిద్ధం చేశారు అధికారులు. కోవిడ్ కేసులు పెరిగితే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది గుంటూరు జనరల్ హాస్పిటల్. ఆక్సిజన్, మెడిసిన్, టెస్టింగ్ కిట్స్ అన్నీ అందుబాటులో ఉంచుకుని, లక్షణాలు కనిపించగానే టెస్టులు చేస్తామని, కానీ ప్రజలు కూడా కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
నమోదయ్యే కేసుల సంఖ్య తక్కువే ఐనప్పటికీ, అన్నీ హాస్పిటల్స్‌కీ కోవిడ్ అలెర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
ముఖ్యంగా దక్షిణాది మీద పగపట్టినట్టుంది కోవిడ్ కొత్త వేరియంట్. అప్రమత్తత, ఆస్పత్రుల్లో సన్నద్ధత ఏమాత్రం ఉందన్న అంశంపై రేపు రాష్ట్రాల అధికారులతో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించబోతోంది. నెలాఖర్లోగా.. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేక ఎడ్వైజరీ రిలీజయ్యే ఛాన్సుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..