
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్లో అధికార,ప్రతిపక్షాలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. రాష్ట్రం నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో మూడు స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. అయితే తమకు బలం లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యసభ రేసులో ఉన్నామని చెబుతుంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు సీట్లలో కనకమేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన గడువు ముగుస్తుండటంతో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ తన ప్రాతినిథ్యాన్ని పూర్తిగా కోల్పోనుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకున్న సీట్లను బట్టి చూస్తే ఏ మాత్రం రాజ్యసభ సీటు దక్కే అవకాశం కనబడటం లేదు. అయినా తాము కూడా రాజ్యసభ రేసులో ఉన్నామని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దీనిపై తమ లెక్కలు తమకున్నాయని కూడా చెబుతున్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఒక సీటు దక్కించుకుంది. టీడీపీ తరపున బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధ గెలుపుతో ఒక ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఓటు వేసారు. దీంతో వైఎస్సార్సీపీకి భారీగా నష్టం జరిగింది. అయితే ఈసారి ఇలాంటి పరిస్థితి రాకుండా వైసీపీ జాగ్రత్త పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక సీటు తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్ధిని బరిలో దింపుతామంటున్నారు ఆ పార్టీ నేతలు.
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో మొత్తం 23 స్థానాలు గెలవగా వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ చెంత చేరారు. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో టీడీపీకి కేవలం18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఒక్కో రాజ్యసభ స్థానానికి 41 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా టీడీపీ విజయానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయినా రాజ్యసభ ఎన్నికల కోసం ఇద్దరి పేర్లు పరిశీలిస్తుంది టీడీపీ అధిష్టానం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతో పాటు టీడీఎల్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే తమకు బలం తక్కువగా ఉన్నప్పటికీ పోటీలో అభ్యర్ధిని నిలబెట్టడానికి కారణం లేకపోలేదంటున్నారు ఆపార్టీ నేతలు.
ఇప్పటికే తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీలో సీట్లు దక్కని అభ్యర్ధులతో పాటు టీడీపీతో టచ్లోకి వచ్చిన ఎమ్మెల్యేలను కలుపుకుని రాజ్యసభలో సీటు దక్కించుకునే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే వర్ల రామయ్యకు రాజ్య సభ టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా చివరి నిమిషంలో అది కాస్తా మారిపోయింది. దీంతో ఈసారి అసలు ఎమ్మెల్యేల బలం లేకుండా వర్ల రామయ్యను బరిలో నిలబడితే ఎలాంటి విమర్శలు వస్తాయో అని కూడా చర్చ జరుగుతుంది. అయితే అన్నీ కలిసొస్తే మాత్రం ఖచ్చితంగా ఒక సీటు తమకు దక్కుతుందని గట్టిగా చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు దానికి తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు చెబుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఎంతవరకూ ఫలిస్తాయనేది చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..