YS Viveka Case: ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్..

|

May 27, 2023 | 11:22 AM

అవినాష్‌ ముందస్తు బెయిల్‌ విచారణ కొనసాగుతోంది. నిన్న అవినాష్‌, సునీతారెడ్డీల వాదనలను విన్న హైకోర్టు.. ఈరోజు ఫైనల్‌ ఎపిసోడ్‌లో సీబీఐ వాదనలు ఉంటాయని వాయిదా వేసింది. అటు.. చంచల్‌ గూడ జైలులో ఉన్న భాస్కర్‌రెడ్డి అస్వస్తతకు గురయ్యారు. మరోవైపు అవినాష్‌ తల్లికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రికి తీసుకొచ్చారు.

YS Viveka Case: ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్..
Ys Viveka Murder Case
Follow us on

ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ విచారణ తెలంగాణ హైకోర్టులో కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన వాదనల్లో కేసు ఎటూ తేలలేదు. దాదాపు 6 గంటల పాటు అవినాష్‌ రెడ్డి న్యాయవాది తన వాదనలను వినిపించారు. ఈ కేసులో పలు అంశాలను ప్రస్తావించిన అవినాష్‌ లాయర్‌.. విచారణలో సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వాచ్‌మెన్‌ రంగన్న స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురు నిందితుల పేర్లు చెప్పినా ఆ వివరాలు ఎక్కడా లేవని అవినాష్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక దస్తగిరిని ఒక్క సారి కూడా విచారణకు పిలువలేదని.. అరెస్ట్‌ చేయలేదని వాదించారు. అవినాష్‌ గురించి దస్తగిరి ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు.

ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంవత్సరం తరువాత జనవరి 23 న అవినాష్‌కు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. అవినాష్‌పై లేని పోని అబాండాలు మోపుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నెల 19న సీబీఐ ముందుకు రావాల్సి ఉండగా.. తల్లి ఆరోగ్యం సీరియస్‌గా ఉండడంతో మార్గమధ్యలో నుంచి వెనక్కు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి కర్నూలు ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపారు. అందుకే 27 వరకు హాజరు కావడానికి సమయం అడిగామన్నారు. ఇక ఆధారాలు మాయం చేస్తారని వస్తున్న ఆరోపణలను కూడా ఖండించారు.

ఆ తర్వాత వాదనల కోసం జోక్యం చేసుకున్న సునీతారెడ్డి లాయర్‌పై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అవినాష్‌ లాయర్‌కు ఇచ్చిన సమయం ఇవ్వాలనడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ వేగంగా సాగే విధంగా చూడాలని కోరడంతో పాటు.. పలు విషయాలను ప్రస్తావించారు. సీబీఐ వాదనలను ఈరోజు వింటామంటూ కోర్టు వాయిదా వేసింది. అయితే బెయిల్‌ పిటిషన్‌ సమయంలో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరో వైపు వివేకా హత్య కేసులో నిందితుడు భాస్కర్‌ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భాస్కర్‌రెడ్డికి బీపీ పెరగడంతో ఉస్మానియాకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ప్రాథమిక చికిత్స తర్వాత భాస్కర్‌రెడ్డిని ఉస్మానియా నుంచి జైలుకు తరలించారు అధికారులు. ఈరోజు నిమ్స్‌కు తీసుకురానున్నారు. అటు.. అవినాష్‌రెడ్డి తల్లిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విశ్వభారతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం