తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాక్రే ఆహ్వానం మేరకు రేవంత్ ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్న 3 సభల్లో ఆయన పాల్గొంటారు. తొలి సభ ఈనెల 11న విశాఖలో జరగనుంది. ఈ నెల 11 న ఉదయం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నాక అక్కడి నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడనుంచి విశాఖకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. 11న జరిగే సభ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగేది కావడంతో అన్ని సంఘాలనూ కలుపుకుని సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం యత్నిస్తోంది.
వాస్తవానికి కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ఏపీలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తారని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ కావడంతో కేంద్ర పెద్దలు సైలంట్‌గా ఉన్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ విషయంపై తమ వైఖరిని బలంగా చెప్పాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఏపీలో బీజేపీని దెబ్బకొట్టడమే కాకుండా.. తాము మద్దతు కూడగట్టుకోవడానికి ఇది అనువైన అంశమని ఏపీ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
పదునైన మాటలతో విరుచుకుపడే రేవంత్ విశాఖ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీరును ఎండగట్టే అవకాశం ఉంది. ఆదిలాబాద్ టూర్‌లో రేవంత్ ప్రధాని మోదీని పెద్దన్న అని పిలిచినా విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ప్రైవేటీకరణ అంశంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో టీడీపీలో అవకాశమిచ్చిన రాజకీయ గురువు చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనే విషయంపై అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…