ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ టూర్స్ అండ్ ట్రావెల్స్… ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదను పెడుతున్నాయి. జనంలోకి వెళ్లేందుకు..యాత్రలకు సిద్ధమయ్యాయి. కౌంట్ డౌన్ మొదలైంది. ఓవైపు.. సామాజిక బస్సు యాత్రకు వైసీపీ రెడీ అవుతుంటే.., మరోవైపు.. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి, బాబుష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీతో నారా లోకేష్ యాత్ర.. ఇక వై నాట్ 175? అని పిలుపునిచ్చిన జగన్… వైసీపీ క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల సమావేశంలో బస్సు యాత్రపై దిశా నిర్దేశం చేశారు.
ఏపీ జగన్‌ను ఎందుకు కోరుకుంటుంది? జగన్ ఏపీకి ఎంత అవసరం.. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఇంటింటికి వివరించాలనేది వైసీసీ సామాజిక న్యాయ యాత్ర ఉద్దేశం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు… ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్షపై విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది వైసీపీ. ఆ దిశగా జగన్ దిశా నిర్దేశం చేశారు కూడా. మూడు ప్రాంతాలను కవర్ చేస్తూ 60 రోజులు పాటు సాగేలా సామాజిక న్యాయ యాత్రను డిజైన్ చేశారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర. ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజుల పాట యాత్ర ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో డిసెంబర్ 31 వరకూ 60 రోజుల పాటు సభలు జరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతినియోజకవర్గంలో ఈ యాత్ర ఉంటుంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.
మరోవైపు.. టీడీపీ కూడా ధీటుగా యాత్రలు చేపడుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ డీపడిపోయాయి. దీన్ని అధిగమించేందుకు నారా లోకేష్, నారా భువనేశ్వరి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి ప్రజల్లో ఉండేలా.. కార్యాచరణ సిద్దమైంది. నిజం గెలవాలి” పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర కు సర్వం సిద్దమైంది. 25 నుంచే భువనేశ్వరీ బస్సు యాత్ర. నారావారిపల్లె నుంచి మొదలై ఐతేపల్లి, నేండ్రగుంట, అగరాల మీదుగా బస్సు యాత్ర కొనసాగుతోంది. ‘నిజం గెలవాలి’..పేరిట బస్సు యాత్ర చేపట్టనున్న క్రమంలో నారా భువనేశ్వరి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత నారావారిపల్లెకి చేరుకున్ని తమ కులదైవం నాగాలమ్మ, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెంది చనిపోయిన నేండ్రగుంటకు చెందిన చిన్నసామినాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు భువనేశ్వరి. ఐతేపల్లి మండలంలో ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేస్తారు. అగరాలలో జరిగే బహిరంగసభలో ప్రసగించనున్నారామె. అలాగే తిరుపతిలోనూ పర్యటిస్తారు భువనేశ్వరీ.26న టీడీపీ-జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తరువాత తిరుపతి బహిరంగసభలో ప్రసంగిస్తారన్నారు టీడీపీ నేతలు.
మరోవైపు నవంబర్ ఫస్ట్ డిసెంబర్ 15 వరకు బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట లోకేష్ యాత్ర చేపట్టనున్నారు. యాత్రల కేంద్రంగా దూసుకొస్తున్న విమర్శలతో ఏపీ పాలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి. నిజం గెలవాలంటే సీబీఐ ఎంక్వయిరీ కోరాలంటూ భువనేశ్వరీ యాత్రపై విమర్శలు సంధించారు మంత్రి రోజా. బస్సులు కదలకముందే అటు ఇటూ విమర్శల బాణాలు దూసుకొస్తున్నాయి. అధికారమే లక్ష్యం., యాత్రలే మార్గం.. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు యాత్ర పవర్‌ఫుల్ మాత్ర గా మారింది. ఎవరి లెక్క వాళ్లకుంది. బస్సులు కదిలాక ఇంకెన్ని సిత్రాలు వెలుగుచూస్తాయో చూడాలిక.