టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఇంకా ఇప్పటికే యువగళం, మహానాడు కార్యక్రమాల ద్వారా ఊహించని స్పందన రావడంతో ఇప్పడు పొత్తులపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం జగన్ ముందస్తు ఎన్నికలు వెళ్లే అవకాశం ఉందనే అంచనాలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లోనే చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో.. అలాగే రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే చంద్రబాబు ఈ భేటీలో ఏపీలో రాజకీయ పొత్తులతో పాటు రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇలా కేంద్రపెద్దలతో చంద్రబాబు అనూహ్య సమావేశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, గత కొంతకాలంగా బీజేపీకి చంద్రబాబు చేరువవుతున్నారు. దేశాభివృద్ధి కోసం అవసమైతే మోదీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమని కూడా చంద్రబాబు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంకా గతేడాది జరిగిన అజాదీ కా అమత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా మోదీ, చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు జీ20 సన్నాహక సదస్సులో భాగంగా మరోసారి మోదీతో బాబు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మోడీ, అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ అయితే అది కచ్చితంగా ఏపీ రాజకీయాలు మలుపు తిరిగేలా చేయగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..