Gorantla butchaiah chowdary: పార్టీలో ప్రక్షాళన చేయాలి. కార్పొరేట్ తరహాగా నడపటం సరికాదు. ఆయారాం, గయారాంలు కాదు. సామాన్య కార్యకర్తలకు న్యాయం చేయండి అంటూ అధినేత చంద్రబాబుతోనే వన్ టు వన్ మాట్లాడేశారు టీడీపీ సీనియర్ నేత. టీడీపీ అధినేత చంద్రబాబుతో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ సందర్భంలో ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించిన చంద్రబాబు గోరంట్ల గౌరవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. భేటీ అనంతరం రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు బుచ్చయ్య.
పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్న మాట వాస్తవమేకానీ, ఎంతో మంది మిత్రులు, అభిమానులు రాజీనామా చేయొద్దని కోరారన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీకి సంబంధించి నా అభిప్రాయాలను చంద్రబాబుకు స్పష్టంగా చెప్పానని, కార్యకర్తల మనోభావాలను అధినేతకు వివరించాన్నారు గోరంట్ల. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగాలన్న ఆయన.. పార్టీలో లోటుపాట్లు ఏమైనా ఉంటే చర్చించుకుంటామన్నారు.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని గోరంట్ల వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమబాటలోకి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా ఉన్నంతకాలం పార్టీకి సేవ చేస్తానన్నారు. అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరినీ బెదిరించడానికో, పదవుల కోసం నేను అసంతృప్తి వ్యక్తం చేయలేదన్నారు. పార్టీ కోసమే నా తపనంతా అని వివరించారు. గోరంట్ల వెంట పార్టీ నేతలు చిన రాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్, జవహర్ భేటీకి హాజరయ్యారు.
Read also: CM Jagan: ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్ సహా పలు రంగాలకు జగన్ సర్కారు ఊతం.. నేడే బటన్ నొక్కి నిధులు విడుదల