తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వం చేస్తున్న చర్యలకు చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారన్న చంద్రబాబు పిచ్చి వేశాలు వేస్తే తోక కత్తిరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులో(Ongole) జరగనున్న మహానాడుకు మంగళగిరి నుంచి బయల్దేరిన చంద్రబాబుకు మార్గం మధ్యలో చిలకలూరిపేట(Chilakaluripet) వద్ద టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ ఇంటికి పోవడం ఖాయమని స్ఫష్టం చేశారు. మహానాడు ఓ ప్రభంజనమన్న చంద్రబాబు.. ఈ మహానాడు ద్వారా క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు పిలుపిద్దామని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలని కోరారు. చిలకలూరిపేట నుంచి బయలుదేరి యడ్లపాడు మండలంలోని వంకాయపాడు చేరుకున్న చంద్రబాబు ర్యాలీకి పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
పార్టీ నాయకులను వేధించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వీటన్నింటికీ భవిష్యత్తులో చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం. ఎంతో మంది సీఎంలను చూశాను. ఇలాంటి పనికిమాలిన చిల్లర ముఖ్యమంత్రిని చూడలేదు. మీరు ఆపితే మహానాడు ఆగుతుందా? ఒంగోలులో సభకు గ్రౌండ్ ఇవ్వరా? నాకు కోపం వస్తే ఎవరినీ వదిలిపెట్టను. మర్యాదగా మీరుంటే నేనూ మర్యాదగా ఉంటా. పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం.
– చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత
ప్రశాంతంగా ఉన్న కోనసీమలో చిచ్చుపెట్టి, అధికార పార్టీకి చెందిన వ్యక్తులే మంత్రి, ఎమ్మెల్యే ఇంటిని తగులబెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పైగా వారు చేసిన అరాచకాలను ప్రతిపక్షాలపై తోయడం జగన్ కు అలవాటుగా మారిందని ఆక్షేపించారు. ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఏం చెప్పాలని బస్సు యాత్ర చేపడుతున్నారన్న చంద్రబాబు.. ఎస్సీలకు సంబంధించిన 28 పథకాలు రద్దు చేశారని ఆక్షేపించారు.
మరోవైపు మహానాడు సభకు స్థలం ఇవ్వకపోవడం, ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు, ప్రైవేటు వాహనాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహానాడును ఘనంగా నిర్వహిస్తామని చెపుతున్నారు. ఈ మహానాడు వేదికగానే పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకొనే దిశగా తమ కార్యాచరణ ప్రకటించటంతో పాటుగా.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి