కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్‌బాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య గొడవ పెరగడానికి కారణమైంది. కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అధికారులు కుర్చీ వేయకపోవడంతో రచ్చ మొదలైంది. దీనిపై మాధవీరెడ్డి సహా టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. మేయర్ పోడియం దగ్గరే నిలబడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిరసనకు దిగారు.
సమావేశంలో తనకు కుర్చీ వేసేదాకా నిలబడే ఉంటానని ఎమ్మెల్యే మాధవీరెడ్డి తెగేసి చెప్పారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేకు ఎలా కుర్చీ వేశారని నిలదీశారు. మేయర్ పోడియం దగ్గర టీడీపీ శ్రేణుల నినాదాలు చేయడంతో.. పోటీగా వైసీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళనకు దిగారు. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. అయినా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు.
మరోవైపు కడప కార్పొరేషన్ బయట టీడీపీ నేతల నిరసన కొనసాగుతోంది. కౌన్సిల్ నుండి తమను సస్పెండ్ చేసేందుకు మేయర్‌కు ఎలాంటి అధికారం లేదన్నారు ఎమ్మెల్యే మాధవీరెడ్డి. కౌన్సిల్ సమావేశం నుండి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచేశారు. టీడీపీకి కౌంటర్‌గా వైసీపీ కూడా సమావేశంలో ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మేయర్‌కు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. అప్పటివరకు సమావేశం జరగనివ్వబోమన్నారు.
తమ అవినీతి బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే మేయర్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవీరెడ్డి. కడపలో జరిగిన అనేక కార్యక్రమాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు.