ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన హిందూపురం(Hindupur) ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో(Gorantla Madhav) వ్యవహారంపై చెలరేగిన నిప్పు ఇంకా ఆరడం లేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా.. పోలీసుల ప్రకటనపై ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. వీడియో నకిలీది కాదని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినట్లు వెల్లడించారు. అంతే కాకుండా పార్టీ తరఫున వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. అయితే ఆ వీడియోలో మార్ఫింగ్ జరగలేదని ల్యాబ్ నిర్వాహకులు స్పష్టం చేశారని పార్టీ నేతలు పట్టాభిరామ్, వంగలపూడి అనిత వివరించారు. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందించారో అందరికీ తెలుసునని, గోరంట్ల మాధవ్ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలో మార్ఫింగ్ జరగలేదనేందుకు సీఎం జగన్‌కి ఈ ఆధారాలు చాలా? ఇంకేమైనా కావాలా?అని ప్రశ్నించారు. ఎంపీ పదవిలో కొనసాగే అర్హత మాధవ్ కోల్పోయారని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోకపోగా ఎంపీని వెనకేసుకొస్తే ఇక రాష్ట్రంలో మహిళలు ఎలా ధైర్యంగా తిరగగలరని నిలదీశారు.
అయితే.. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసులో ఎవరిపై కేసు నమోదు చేయలేదని, ఒరిజినల్ వీడియో దొరికితే అది సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే వీడియోను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేదని వెల్లడించారు. వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడానికి ముందు ఐదుగురు వ్యక్తులు ఫార్వర్డ్ చేశారని, వారు ఎవరనే విషయంలో క్లారిటీ వస్తే అన్ని నిజాలూ బయటకు వస్తాయని చెప్పారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్‌తో వీడియో అప్‌లోడ్ అయ్యిందని, అందుకే వీడియో ఒరిజినల్ అవునా? కాదా? అనేది నిర్ధారించలేకపోతున్నట్లు వివరించారు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
కాగా.. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ మాధవ్ మండిపడ్డారు. టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ వీడియోను సర్క్యులేట్ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఎంపీ స్పష్టం చేశారు. ఎంపీ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉండి ఇలా ఎలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..