TDP Leader Murder Case: గుంటూరు జిల్లా టీడీపీ నేత హత్య కేసులో పురోగతి.. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు

TDP Leader Murder Case:  గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో జనవరి 3న టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌, పురంశెట్టి అంకులు హత్యకు గురైన విషయం తెలిసిందే...

TDP Leader Murder Case: గుంటూరు జిల్లా టీడీపీ నేత హత్య కేసులో పురోగతి.. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు

Updated on: Jan 20, 2021 | 8:14 PM

TDP Leader Murder Case:  గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో జనవరి 3న టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌, పురంశెట్టి అంకులు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ తెలిపారు. ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. పాతకక్షల కారణంగా అంకులు హత్యకు గురయ్యారని అన్నారు. పెదగార్లపాడు గ్రామానికి చెందిన పురంశెట్టి అంకులు గతంలో నిషేధిత నక్సల్ సంస్థ జనశక్తిలో పని చేశారు. అతనితో పాటు అదే గ్రామానికి చెందిన చిన్నశంకరరావు, వెంకట కోటయ్య, వెంకటేశ్వరరెడ్డి కూడా గతంలో అందులో పని చేశారు. వీరికి, అంకుల్‌కు మధ్య కొన్నాళ్లుగా విబేధాలు తలెత్తాయి. ఈ సమయంలో అంకులు వద్ద మూడు దశాబ్దాలుగా నమ్మకంగా పని చేస్తున్న చిన్న కోటేశ్వరరావు తనకు సరిగా జీతం ఇవ్వడం లేదని కోపం పెంచుకున్నాడు. వీరంతా ఒకటై అంకులును హత్య చేసేందుకు ప్లాన్‌ వేశారు.

వీరి పథకం ప్రకారమే చిన్న శంకరరావు తన బంధువులైన అంకారావు, రమేష్‌లను పిలిపించుకున్నాడు. దీంతో జనవరి 3న పెదగార్లపాడులోన ఉన్న తన అపార్టుమెంట్‌కు రావాలని, కొన్ని విషయాలు మాట్లాడేది ఉందని చెప్పి అంకులును పిలిపించుకుని అహారంలో మత్తు పదార్థం కలిపి తినిపించారు. ఆ తర్వాత టవల్‌తో గొంతు బిగించి కత్తితో పొడిచి హత్య చేశారు అని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో చిన్న శంకరరావు, చిన్న కోటేశ్వరరావు, వెంకటకోటయ్య, వెంకటేశ్వరరెడ్డి, అంకారావు, రమేష్‌లను అరెస్టు చేశామని, వీరిని త్వరలో కోర్టులో హాజరు పరుస్తామని ఎస్పీ విశాల్‌ వెల్లడించారు.

Also Read: హుకుంపేట విగ్రహాం మలినం కేసులో పురోగతి.. ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి పీఏ సందీప్ అరెస్ట్..!