
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఊహించని రీతిలో అరెస్ట్ కావడం, ఆ తర్వాత జైలుకి వెళ్లడంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకటన చేయడంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. అంతకుముందు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పటికీ పొత్తులపై ఎన్నికలప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెప్పుకుంటూ వచ్చారు. అప్పటివరకూ రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యం అంటూ ఇరువురు నేతలు చెప్పుకొచ్చారు. దీంతో ఎవరికి వారే ఆయా పార్టీల తరపున కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తు విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా.. బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతోనే పొత్తులో ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారు. టీడీపీతో పొత్తు ప్రకటన సందర్బంగా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కలిసొస్తుందో.. లేదో.. చెప్పలేనని కూడా స్పష్టం చేశారు. ఇదంతా ఇలా కొనసాగుతుండగానే అవనిగడ్డ వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అనేక అనుమానాలకు దారితీసింది. ఎప్పుడూ టీడీపీతో పాటు బీజేపీ ప్రస్తావన తీసుకొచ్చే పవన్ కళ్యాణ్.. అవనిగడ్డ సభలో బీజేపీ ప్రస్తావన తీసుకురాకపోవడంతో టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ లేనట్లేనా అనే చర్చ మొదలైంది.
అవనిగడ్డ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. పవన్ ప్రకటనకు కొన్ని గంటల ముందే బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు తాము జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్పారు. మరి అవనిగడ్డ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రస్తావన తీసుకురాకపోవడానికి కారణం ఏంటి.?
తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్లాలని ముందుగానే నిర్ణయం తీసుకుందా..? టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఆసక్తి చూపడం లేదా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజమండ్రిలో చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. త్వరలోనే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో కలుస్తానని చెప్పారు. కానీ పవన్ ఢిల్లీకి వెళ్లలేదు. రాబోయే సంకీర్ణ ప్రభుత్వం టీడీపీ-జనసేనతోనే ఏర్పడుతుందని చెప్పారు. అంటే బీజేపీ ఈ విషయంలో పవన్‌కు క్లారిటీ ఇచ్చేసిందా అనే చర్చ కూడా జరుగుతుంది. అందుకే బీజేపీ అంశాన్ని పవన్ ప్రస్తావించలేదంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందుకే టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఇష్టపడలేదేమో అని కూడా టీడీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. అవనిగడ్డలో పవన్ వ్యాఖ్యలతో పొత్తులపై బీజేపీకి తాము దూరం అనే సంకేతాలను పవన్ ఇచ్చేసారా అని కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం టీడీపీతో కలిసి ప్రయాణించేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఈ పరిణామలన్నీ చూస్తే బీజేపీతో జనసేన బంధానికి బ్రేక్ పడిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
తెలుగుదేశం పార్టీ-జనసేన కలిసి మాత్రమే ఎన్నికలకు వెళ్తే వామపక్షాలు కూడా తోడవుతాయని తెలుస్తోంది. సీపీఐ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించింది. చంద్రబాబు,పవన్‌ల తరపు నుంచి ఎలాంటి స్పందన లేనప్పటికీ టీడీపీతో కలిసి వైసీపీని గద్దె దించేందుకు తాము సిద్దమన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇక సీపీఎం కూడా రేపోమాపో మా నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెబుతోంది. దీంతో జనసేన గనుక బీజేపీకి దూరం అయితే టీడీపీ-వామపక్షాలతో కలిసి ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రంపై నిన్న మొన్నటివరకూ ఎనలేని ప్రేమ చూపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అంత తేలికగా బీజేపీని దూరం చేసుకుంటారా అనే చర్చ కూడా మొదలైంది. మొత్తానికి అవనిగడ్డలో పవన్ ప్రసంగం అనేక ప్రశ్నలకు దారి తీసింది. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం ఇంకా స్పందించలేదు. మరి రాబోయే రోజుల్లో పొత్తుల విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..