TDP-Janasena Alliance: అలా చేస్తేనే జనసేనకు మద్దతు..! పవన్‌కు కాపు నేతల అల్టిమేటం..

|

Sep 20, 2023 | 10:00 PM

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ పొత్తుతో జనసేనకు కాపుల నుంచి అల్టిమేటం వచ్చింది. చంద్రబాబుతో ఉంటే పవన్‌ కల్యాణ్‌కి నో సపోర్ట్‌ అంటున్నారు కాపులు.

TDP-Janasena Alliance: అలా చేస్తేనే జనసేనకు మద్దతు..! పవన్‌కు కాపు నేతల అల్టిమేటం..
Janasena - TDP Alliance
Follow us on

కాకినాడ, సెప్టెంబర్ 20: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ పొత్తుతో జనసేనకు కాపుల నుంచి అల్టిమేటం వచ్చింది. చంద్రబాబుతో ఉంటే పవన్‌ కల్యాణ్‌కి నో సపోర్ట్‌ అంటున్నారు కాపులు. బాబుతో కలిసి నడిస్తే తమ మద్దతు ఉండదని తెగేసి చెబుతున్నారు. తమ మద్దతు కావాలంటే పవన్‌ కళ్యాణ్.. సైకిల్‌ ఎక్కకూడదంటూ అల్టిమేటం ఇచ్చారు కాకినాడ జిల్లా కాపులు.

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలో కాపు నేతల చర్చా గోష్టి జరిగింది. పలువురు కాపు పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనిలో కాపు నేతలతో పాటు న్యాయవాదులు, చిరంజీవి, పవన్‌ కల్యాణ్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని కాపు నేతలు డిమాండ్‌ చేశారు. జనసేన ఒంటరిగా పోటీ చేయకపోతే పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇవ్వబోమని తెగేసి చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతారనుకున్నామని.. కానీ ఆయన టీడీపీతో కలుస్తారని అనుకోలేదంటూ వాపోయారు కాపు కుల సంఘాల నేతలు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. అది తమకు ఇష్టం లేదంటున్నారు కాపు నేతలు. చంద్రబాబుపై వాళ్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

చంద్రబాబు మాటలు నమ్మలేమన్నారు. గతంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు అనేక రకాలుగా వేధించారన్నారు. కాపులపై ప్రేమ లేని చంద్రబాబుతో పవన్‌ కలిసి నడవకూడదన్నారు. టీడీపీతో పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తేనే కాపుల మద్దతు ఉంటుందని కుల సంఘాల నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని వాళ్లు అభిప్రాయపడ్డారు. అందువల్ల టిడిపితో పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేయాలి. అలా అయితేనే కాపుల మద్దతు పవన్‌ కల్యాణ్‌కు ఉంటుందంటున్నారు. మరి కాపు నేతల అల్టిమేటమ్‌పై జనసేన నేతలు, పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..