
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రావచ్చనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం 2024లో సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చనే అంచనాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. దీనిలో భాగంగా ఇప్పటినుంచే ఎన్నికలు ఎప్పుడూ జరిగిన సిద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అయితే ఇటీవల కాలంలో పార్టీ నాయకులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నాయకులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. జగ్గయ్యపేట, నందిగామలో నవంబర్ 4వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న బాదుడే బాదుడు కార్యక్రమంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావొచ్చని ప్రచారం జరుగుతోందిని, 2023 డిసెంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటూ.. పార్టీ నేతలంతా ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబునాయుడు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందనేది కేవలం ప్రచారం మాత్రమేనని, తమకు ఆ అవసరం లేదని వైసీపీ చెబుతోంది. అయితే ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజల్లో అర్హులైన కుటుంబాలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు. ఆర్థిక ప్రయోజనం చేకూరుతుండటంతో ప్రభుత్వంపై ప్రజలు సానుకూల ధృక్పదంతో ఉన్నారనేది వైసీపీ ప్రభుత్వ వాదన. అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని టీడీపీ, జనసేన, బీజేపీ సహా పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకతతో ఉన్నారనే వాదనను ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేకతతో ఉన్నవాళ్లు ఉంటారు. అయితే ప్రజావ్యతిరేకత ఎక్కవైతే మాత్రం ప్రభుత్వానికి ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని, ప్రజా వ్యతిరేకత ఎక్కవ కాకముందే ఎన్నికలకు వెళ్తే బావుంటదనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నప్పటికి ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికలు రావచ్చనే ప్రచారంతో రాజకీయం వేడెక్కుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..