
వైసీపీ (YCP) నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన కరుణాకర్ కుటుంబాన్ని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కరుణాకర్ మృతికి కారణమైన వారికి శిక్షపడేవరకు తెలుగుదేశం పోరాటం చేస్తుందని చంద్రబాబు (Chandrababu) చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి, ధైర్యం చెప్పారు. కరుణాకర్ మృతికి వైసీపీ నేతలే కారణమని చంద్రబాబు ఆరోపించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పారు. పిల్లల చదువు, బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. తన ఆత్మహత్యకు కారణమెవరో కరుణాకర్ సూసైడ్ లెటర్ లో తెలిపినప్పటికీ కనీసం ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదని పోలీసులు తీరుపై మండిపడ్డారు.
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముసునూరు కాలనీకి చెందిన కరుణాకర్ చేపల చెరువును సబ్ లీజుకు తీసుకున్నాడు. అందులో చేపల పెంపకం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా.. ఈసారి వర్షాలు కురిశాయి. చేపలు పట్టి అమ్మేయాలని అనుకుంటున్న సమయంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు అడ్డుకున్నారు. కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడం, చెరువులో మందు కలపడం వంటివి చేశారు.
ఈ పరిణామాల మధ్య కరుణాకర్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. తన సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి విన్నపించుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పులెలా చెల్లించాలన్న ఒత్తిడి తట్టుకోలేక కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూసైడ్ నోట్ రాశాడు.
మరిన్ని ఏపీ వార్తల కోసం