ఎన్నికలొస్తున్నాయంటే చాలు..టీడీపీలో ఒక రకమైన రాజకీయం మొదలవుతుంది. అంతవరకు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు..సడెన్‌గా ఊడిపడతారు ఎన్‌ఆర్‌ఐలు..పార్టీలోకి క్యూ కట్టేస్తారు..టీడీపీ సీటు సాధించేందుకు పడరాని పాట్లు పడతారు. ఓ ఏడాది ముందు నుంచే ఫౌండేషన్ లు, ఎన్జీవోల పేరుతో సోషల్ సర్వీస్ అంటూ తెగ హడావుడి చేస్తారు..అంతేనా..అప్పటి వరకూ నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్లను అస్సలు లెక్క చేయరు..చాలాసార్లు టీడీపీలో ఇదే జరిగింది..సైకిల్ పార్టీలో ఎమ్మెల్యే సీటు కోసం చాలాచోట్ల ఎన్నారైలు ఓ రేంజ్ లో హడావుడి చేశారు. ఇప్పుడీ సంస్కృతికి పార్టీ అధినేతే స్వస్తి చెబుతున్నట్లు..జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి..
శృంగవరపు కోట నుంచి గొంపా కృష్ణ తానా చైతన్య స్రవంతి పేరిట రైతులకు ఉచిత వ్యవసాయ పనిముట్లు అందజేశారు..టీడీపీలో ఎన్నారై నేత కోమటి జయరాం సపోర్ట్ తో సీటు వస్తుందని ఆశించారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్థానంలో టిక్కెట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. గతంలో కొంచెం హడావుడి చేసిన కృష్ణ…ఈ మధ్య పెద్దగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు..కోళ్ల ఫ్యామిలీ ఎప్పటి నుంచో టీడీపీని నమ్ముకుని ఉండటంతో కృష్ణకు సీటు లేదని చంద్రబాబు కరాఖండీగా చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుమారు 9 నెలల క్రితం అమెరికా నుంచి వచ్చి వెనిగండ్ల ఫౌండేషన్ అంటూ గుడివాడలో ఎప్పుడూ లేనంత హడావుడి చేసారు వెనిగండ్ల రాము. గుడివాడ రూపు రేఖలు మార్చేస్తానంటూ..మొదట రెండు నెలలు ప్రజల్లో తిరిగారు..ఆ తర్వాత పసుపు కండువా కప్పుకున్నారు..టీడీపీ తరపున తన ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు అంటూ ఉచితంగా దుస్తుల పంపిణీ, జాబ్ మేళాలు నిర్వహించారు.చంద్రబాబు గుడివాడ పర్యటన తర్వాత వెనిగండ్ల రాము..సడెన్ ఫౌండేషన్ పాలిటిక్స్ సర్వీసులు ఆపేశారు..
ఇప్పటికే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు వెనిగండ్ల రాముకు ఏమాత్రం పొసగడం లేదు. సీనియర్ అయిన తనకే సీటు ఇవ్వాలంటూ రావి పట్టుబడుతున్నారు. అయితే సామాజికంగా..ఆర్ధికంగా చూస్తే తనకే సీటు వస్తుందనే ధీమాతో ఉన్న రాము..ఉన్నట్టుండి సైలెంటయ్యారు. దీని వెనుక వెనిగండ్లకు టిక్కెట్ లేదనే క్లారిటీ రావడమేనంటున్నారు గుడివాడ తమ్ముళ్లు..
ఇక ఎన్నారైల విషయంలో ఇటీవల మాజీ మంత్రి పుల్లారావు చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి.ఎన్నికలకు ముందు ట్రస్టులు, సేవా కార్యక్రమాలంటూ హడావుడి చేసి టిక్కెట్ల కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పుల్లారావు..ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో భాష్యం ట్రస్ట్ పేరుతో సేవలు చేస్తున్న భాష్యం ప్రవీణ్ ను ఉద్దేశించి పుల్లారావు ఈ వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు గుంటూరు వెస్ట్ సీటు కోసం ఎన్నారైలు కుస్తీలు పడుతున్నారు. చంద్రబాబుకే హెడ్డేక్ తెప్పిస్తున్నారు.
గతంలో నాట్స్ అధ్యక్షుడిగా పనిచేసిన మన్నవ మోహన కృష్ణ, ఉయ్యూరు ఫౌండేషన్ పేరుతో ఉయ్యూరు శ్రీనివాస్ కూడా నిన్న మొన్నటిదాకా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో.. చంద్రబాబు పాల్గొన్న సమయంలోనే తొక్కిసలాట జరిగింది..ఆ తర్వాత అటు మన్నవ, కానీ ఇటు ఉయ్యూరు శ్రీనివాస్ కానీ ఎక్కడా కనిపించలేదు.
ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల ఇంచార్జిల నియామకాలతో పాటు పార్టీలో పదవుల భర్తీపై దృష్టి పెట్టారు..ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న ఎన్నారైలకు ఇంచార్జిలుగా కాకుండా పార్టీ పదవులు ఇవ్వడంతో వీరికి సీట్లు లేవని..రావనే చర్చ జరుగుతోంది..ఎన్నికల ముందు హడావుడి చేసే NRIల కంటే..మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని, ప్రజల్లో ఉన్న నేతలకే టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపారని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.చంద్రబాబు నిర్ణయం తర్వాతే సేవా కార్యక్రమాల విషయంలో ఎన్నారైలు జోరు తగ్గించారని తమ్ముళ్లే అనుకుంటున్నారు. మరి ఇంతకాలం హడావుడి చేసిన ప్రవాసాంధ్రులు చంద్రబాబు డెసిషన్ తో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం