త్రి-దళపతికే భద్రతగా నిలిచిన ధీరుడు
దేశం కోసం ప్రాణం అర్పించిన వీరుడు
మాతృభూమి సేవలో అమరుడైన సైనికుడు
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్య క్రియలు ముగిశాయి. చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం.. ఎగువరేగడ గ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భరతమాత ముద్దుబిడ్డను కడసారి కళ్లారా వీక్షించేందుకు.. జనం వేలాదిగా తరలివచ్చారు. సాయితేజ అమర్ రహే, జై జవాన్ అంటూ నినదించారు.
అంతకుముందు వీరజవాన్, లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని ఆయన ఎగువరేగడికి ర్యాలీగా తీసుకెళ్లారు. దారిపొడవునా సాయితేజకు పుష్పాంజలి ఘటించారు స్థానికులు. అంబులెన్స్‌పై పూలుజల్లుతూ.. దేశభక్తి నినాదాలిస్తూ నివాళులు అర్పించారు. దేశ రక్షణే ధ్యేయమంటూ బయలు దేరిన.. సాయితేజ ఇక లేడనీ.. అమరుడయ్యాడనే వార్త తెలియగానే.. ఆ కుటుంబం శోకసంద్రమైంది. జనవరిలో వస్తానని చెప్పి… హెలికాప్టర్ ఘటనలో అందరినీ విడిచి వెళ్లిపోయాడు సాయితేజ.
విధి తలచిందో.. ఆయనకే ఆలోచన వచ్చిందో.. తెలీదు కానీ.. చివరిసారిగా ఆయన మాట్లాడిన ఫోన్ కాల్‌ను తలచుకుని ఆకుటుంబం కన్నీటి పర్యంతమైంది. పాపను చూడాలనే తాపత్రయం.. వచ్చే నెలలో వస్తా అని చెప్పిన మాటలే.. చివరి జ్ఞాపకాలు. మీరు కష్టపడొద్దు పొలం పనులు చేయొద్దంటూ తండ్రికి ఎప్పుడూ చెప్తుండేవాడు. ఈ ఘటనకు ముందు కూడా సాయితేజ.. తన తండ్రితో మాట్లాడాడు. ఆ మాటలను తలచుకుని.. ఆ తండ్రి పడే వేదన.. అందరినీ కన్నీరు తెప్పిస్తోంది.
బిపిన్ రావత్ మనసు మెప్పించి, శెభాష్ అనిపించుకున్నారు సాయితేజ. తానున్నంత వరకూ తనతోనే ఉండాలని జనరల్ బిపిన్ రావత్ చెప్పేంత ఉన్నత స్థాయికి బిపిన్ రావత్ ఎదిగారు. చివరకు ఆయనతో కలిసే.. ఈ లోకాన్ని వీడారు.
సాయితేజ పార్థీవదేహంపై కప్పిన జాతీయ జెండా అతడి భార్య శ్యామలకు అందించారు ఆర్మీ అధికారులు. భారీ జనం కన్నీటి నివాళితో ఎగువరేగడలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది.
ఆర్మీలో… త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌నే మెప్పించగల స్థాయికి చేరారు సాయితేజ. ఆయనకు పీఎస్‌ఓగా పనిచేస్తూనే.. డ్యూటీలో ఉండగానే.. చాపర్ ప్రమాదంలో అశువులు బాశారు.
సాయితేజ అమర్ రహే, జై జవాన్.. భారత్ మాతాకీ జై నినాదాలతో ఎగువరేగడ మారుమోగిపోతుంది. అక్కడికి వచ్చిన ప్రజలందరూ సాయితేజకి కడసారి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
సాయితేజ అమరువీరుడు అనే నినాదాలతో మారుమోగుతున్న తెలుగు నేల. సాయితేజ భౌతిక ఖాయానికి ఆర్మీ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. కడసారి కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు.
అమరమరణం పొందిన సాయితేజకు కన్నీటి వీడ్కోలు పడుతోన్న దేశం. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయితేజ భార్యను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.
సైనిక లాంచనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తోంది ఆర్మీ. అనతికాలంలోనే అతడి ఎదిగిన తీరు.. ఇలా ఈరోజు ఎమోషనల్ అవ్వడం చూసి.. సాయితేజ సహచరులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
తెలుగు తేజం సాయితేజకు యావత్ దేశం జేజేలు కొడుతోంది. 30 కిలోమీటర్ల మేరు సాయితేజ అంతిమయాత్ర సాగుతోంది. దారిపొడవునా ప్రజలు సాయితేజకు నివాళి ఘటిస్తున్నాడు.
ప్రాణం లేని కొడుకును చూసిన తండ్రి.. గుండెల బాదుకుని రోదించారు. నిర్జీవంగా మారిన కొడుకును చూసి.. ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. అక్కడున్న వారికే కాదు.. ఈ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అమర జవాన్‌కు తుది నివాళి అర్పించేందుకు.. ఎగువ రేగడకు వేలాది మంది తరలివచ్చారు.
సాయితేజ ఇంటి దగ్గర దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తండ్రి ఏమయ్యాడో తెలీని అమాయకత్వంతో సాయితేజ ఫోటోకు ముద్దుపెట్టుకున్నాడు అతని కుమారుడు. చిత్రపటానికి సెల్యూట్ చేసి నివాళి అర్పించాడు.
సాయితేజ మృతదేహాన్ని చూసి.. అతని భార్య శ్యామల గుండెలవిసేలా రోదించింది. దీంతో ఆమె సొమ్మసిల్లిపడిపోయింది. సాయితేజ తల్లిదండ్రులు కూడా బోరున విలపిస్తున్నారు. సాయితేజ తండ్రి మోహన్‌ను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.
సాయితేజ సొంతూరు ఎగువరేగడకు అతని భౌతికకాయం తరలించారు. అతని ఇంటికి దగ్గర్లోని ఓ గ్రౌండ్‌లో భౌతికకాయాన్ని ఉంచారు. అయితే భారీగా జనం తరలిరావడంతో అక్కడ.. ఉద్విగ్న వాతావరణం నెలకుంది