Tadipatri Ragada: ఇప్పుడిప్పుడే చల్లారుతున్న తాడిపత్రిలో చిచ్చుపెట్టిన అక్రమ ఇసుక రవాణా..!
మరోసారి తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణ నెలకొంది. ఈసారి అక్రమ ఇసుక రవాణాపై మొదలైన గొడవ.. పోలీసులు సారీ చెప్పే దాకా వెళ్లింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై తాడిపత్రి రూరల్ లక్ష్మీకాంత్ రెడ్డి దురుసు ప్రవర్తన ఉద్రిక్తతలకు దారితీసింది.
మరోసారి తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణ నెలకొంది. ఈసారి అక్రమ ఇసుక రవాణాపై మొదలైన గొడవ.. పోలీసులు సారీ చెప్పే దాకా వెళ్లింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై తాడిపత్రి రూరల్ లక్ష్మీకాంత్ రెడ్డి దురుసు ప్రవర్తన ఉద్రిక్తతలకు దారితీసింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని కేసులు పెట్టాలని అడిగితే.. ఏకంగా ఎమ్మెల్యేపైనే సీఐ దురుసుగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. దీంతో సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వ్యవహార శైలిపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. దాదాపు 5 గంటలపాటు వర్షంలో తడుస్తూ సీఐపై నిరసన వ్యక్తం చేశారు. చివరకు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెబితే గాని ఆందోళన సద్దుమణగలేదు. తాడిపత్రి వరకే పరిమితమైందనుకున్న అక్రమ ఇసుక రవాణా వ్యవహారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది.
తాడిపత్రిలో మంగళవారం(ఆగస్ట్ 27) మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారపక్షంలో ఉండి కూడా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని టీడీపీ నాయకులు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. అయితే అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేశారు.
అయితే ఫోన్‌లో సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో దురుసుగా మాట్లాడారని, మీరు ఎమ్మెల్యే అయితే నాకేంటి.. మీరు చెబితే కేసులు నమోదు చేయాలా? అంటూ సీఐ లక్ష్మీ కాంత్ రెడ్డి దురుసుగా వ్యవహరించినట్లు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆరోపించారు. సీఐ దురుసు వ్యవహారశైలిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలతో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఓవైపు అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయకుండా, అడిగినందుకు ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడటంపై జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 5 గంటల పాటు వర్షంలో తడుస్తూనే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వీడియో కాల్‌లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, టీడీపీ నాయకులు ఆందోళన విరమించారు.
వీడియో చూడండి…
అయితే తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారానికి సంబంధించిన పంచాయతీ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. తాడిపత్రిలో గత నెల రోజులుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా.. స్థానిక పోలీసులు పట్టించుకోవడంలేదని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి దురుసు ప్రవర్తన పై కూడా ఎమ్మెల్యే, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలో ఎట్టి పరిస్థితుల్లో అక్రమ ఇసుక రవాణా జరగనివ్వమని, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు అవసరమైతే ఒక ప్రత్యేక పోలీస్ టీంను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే, ఎస్పీ జగదీష్ ను కోరారు. అదేవిధంగా తాడిపత్రిలో ఇటీవల జరిగిన పరిణామాలను కూడా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, జిల్లా ఎస్పీకు వివరించారు.
ఇదిలావుంటే, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, జిల్లా ఎస్పీ జగదీష్ ను కలవడానికి ముందే.. వివాదానాకి కారణమైన సీఐ లక్ష్మీ కాంత్ రెడ్డి ఎస్పీ జగదీష్ ను కలిశారు. ఎమ్మెల్యే పై తాను దురుసుగా ప్రవర్తించలేదని సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలుగుతుందని, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆ సమయంలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని క్షమాపణ కోరాను అన్నారు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి. తాడిపత్రి ఘటనలో తన వైపు నుంచి ఎలాంటి తప్పులేదన్నారు సీఐ. ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే, ఈ కేసు తన పరిధిలోని అంశం కాదని, డీఎస్పీ విచారణ చేస్తారని మాత్రమే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో చెప్పారన్నారు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి. నామీద ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.
మొత్తం మీద మరోసారి తాడిపత్రిలో టెన్షన్ వాతావరణ నెలకొంది. మొన్న టిడిపి వర్సెస్ వైసిపి రాళ్లదాడితో ఘర్షణ వాతావరణం నెలకుంటే, నిన్న ఎమ్మెల్యే వర్సెస్ సీఐ దురుసు ప్రవర్తన వల్ల మరోసారి తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి దురుసు ప్రవర్తనపై ఇప్పటికే జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణలో సీఐ తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా ఎస్పీ జగదీష్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..