ఏపీ మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నామినేషన్ల గడుపు పెంపు!
ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు 48 గంటల గడువు పొడిగించాలని, జిల్లా కలెక్టర్ సమక్షంలో నామినేషన్లు దాఖలు చేసే ఏర్పాట్లు చేయాలని సూచించింది. అభ్యర్థులు, ప్రతిపాదకులకు పోలీసు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యతని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు, విజ్ఞప్తులపై విచారణ జరిపిన కోర్టు.. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ముఖ్య ఆదేశాలు
నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల కోసం సమయాన్ని పొడిగించేలా చర్యలు తీసుకోవాలని, పోటీ చేసేందుకు కనీసం 48 గంటల గడువు కల్పించాలని ఆదేశించింది. నామినేషన్లు వేయలేని వారి కోసం ఏం చేయాలనే దానిపై అక్టోబర్ 22వ తేదీలోగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అభ్యర్థుల మనస్సుల్లో ఉన్న భయాలు, అపోహలను తొలగించేలా జిల్లా కలెక్టర్ సమక్షంలో జిల్లా కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.నామినేషన్లు దాఖలు చేసే ప్రతీ అభ్యర్థికి, వారి ప్రతిపాదకులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించింది. శాంతిభద్రతలను కాపాడుతూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల ప్రక్రియను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 27 వాయిదా వేసింది.
న్యాయసమీక్ష అధికారం కిందే ఈ ఆదేశాలు
ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగబద్ధమైనదని, నామినేషన్లను అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోదని జస్టిస్ బాబ్జి జస్టిస్ మోహన ధర్మ స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన న్యాయసమీక్ష అధికారం కింద పారదర్శక వాతావరణం కోసం ఈ ఆదేశాలు ఇస్తున్నా మన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడుతూ, పోలీసులు అధికారులు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయాలు తీసుకుని, తదనుగుణంగా కొత్త ఏర్పాట్లు చేయనుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
