AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పేద విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య!

తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (RTE) ప్రకారం పేద పిల్లలకు 25% ఉచిత సీట్ల కేటాయింపు అమలుపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. రాష్ట్రంలో ఈ నిబంధనల అమలు నెమ్మదిగా సాగుతుండటంతో NCPCR, సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాయి. అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ప్రత్యేక పోర్టల్, పారదర్శక ప్రక్రియ అవసరం.

Telangana: పేద విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య!
Telangana RteImage Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Oct 21, 2026 | 12:37 PM

Share

హైదరాబాద్: తెలంగాణలోని పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను అర్హులైన విద్యార్థులకు కేటాయించాలి. అయినప్పటికీ, రాష్ట్రంలో ఈ నిబంధన అమలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు దృష్టి సారించడంతో విద్యాశాఖ అధికారులు అమలుపై దృష్టి పెట్టారు.

విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది?

విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ఒకటో తరగతిలో కనీసం 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలి. ఈ విధానం ద్వారా అర్హులైన విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్, లాటరీ విధానం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

తెలంగాణలో పరిమితంగానే అమలు

ఈ నిబంధనల అమలులో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాలు ముందడుగు వేస్తుండగా.. తెలంగాణలో మాత్రం ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. గతంలో ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలవగా, చట్టాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ తెలిపింది. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని 96 ఆవాసాల్లోని పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా 2025 జులైలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఆదేశాల అమలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం, 2025-26, 2026-27 విద్యా సంవత్సరాల్లో కలిపి ఇప్పటివరకు కేవలం 180 మంది విద్యార్థులకే ప్రవేశాలు లభించాయి.

సుప్రీంకోర్టు విచారణతో అధికారుల్లో కదలిక

ఈ అంశంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (NCPCR) రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఢిల్లీకి వెళ్లి అమలు చర్యలపై హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 27న జరిగే విచారణకు NCPCR హాజరై అమలు తీరుపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అర్హులైన పిల్లలకు ప్రవేశాలు కల్పించేందుకు ప్రత్యేక పోర్టల్, దరఖాస్తుల స్వీకరణ, పారదర్శక సీట్ల కేటాయింపు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, కొత్త ప్రవేశాల షెడ్యూల్, దరఖాస్తుల తేదీలు, అర్హత ప్రమాణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us