Summer Holidays to HC: రేపట్నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..

|

May 14, 2023 | 8:15 AM

ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. రెండు దశల్లో ఈ వెకేషన్‌ కోర్టులు పనిచేస్తాయి. మొదటి దశ వెకేషన్‌ కోర్టులు మే 16 నుంచి 26 వరకు, రెండో దశ కోర్టులు మే 27 నుంచి జూన్‌ 12 వరకు పనిచేస్తాయి..

Summer Holidays to HC: రేపట్నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..
Andhra Pradesh High Court
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు రేపట్నుంచి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 15 నుంచి జూన్‌ 12 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు ప్రకటించారు. అలాగే మూడు పని శనివారాలు, అంటే మే 20, మే 27, జూన్ 3 రిజిస్ట్రీకి సెలవులుగా ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్‌ 13న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. రెండు దశల్లో ఈ వెకేషన్‌ కోర్టులు పనిచేస్తాయి. మొదటి దశ వెకేషన్‌ కోర్టులు మే 16 నుంచి 26 వరకు, రెండో దశ కోర్టులు మే 27 నుంచి జూన్‌ 12 వరకు పనిచేస్తాయి. వీటిల్లో భౌతిక, ఆన్‌లైన్‌ విధానంలో కేసులను విచారిస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటుచేశారు.

ఈ వెకేషన్‌ కోర్టుల్లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, ఇతర అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, సర్వీసు సంబంధిత కేసులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చట్టానికి సంబంధించిన అత్యవసర కేసులను విచారిస్తారు. ఐతే సీఆర్‌పీసీ సెక్షన్‌ 482, అధికరణ 226 కింద ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్లను కొట్టేయాలంటూ దాఖలుచేసే వ్యాజ్యాలను వెకేషన్‌ కోర్టుల్లో విచారించబోమన్నారు. ఇక మొదటి దశ వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ బీఎస్‌ భానుమతి, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఉంటారు. ఇక రెండో వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్‌ దుప్పల వెంకటరమణ, జస్టిస్‌ వి.గోపాలకృష్ణరావు ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.