గుంటూరు, సెప్టెంబర్ 8: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. విషసర్పం కాటు వేయడంతో విద్యార్ధి మృతి చెందాడు. ఈ విషాద ఘటన శనివారం (సెప్టెంబర్ 7) సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో (ఏఎన్‌యూ)లో రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు పలు కోర్సులు చదువుతుంటారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు పొలాలు, అడవుల్లో పుట్టగొడుగులు పైకి వస్తాయి. వీటి కోసం కొందరు స్థానికులు ఆయా ప్రాంతాలను గాలించి వాటిని తెచ్చుకుని వంటకు వినియోగిస్తారు. అయితే తాజాగా నాగార్జున యూనివర్సిటీలో బుద్ధిజం చదువుతున్న కొండన్న అనే విద్యార్ధి కూడా పుట్ట గొడుగుల కోసం వెళ్లాడు. శనివారం సాయంత్రం యూనివర్సిరటీలోనే చెట్ల పొదల్లోకి వెళ్లాడు.
ఈక్రమంలో రక్తపింజర పాము విద్యార్ధి కాలిపై కాటు వేసింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మయన్మార్‌కు చెందిన విద్యార్థి కొండన్న మృతిచెందాడు. దీంతో చేసేదిలేక విద్యార్ధిని మార్చురీకి తరలించారు. కాగా మృతి చెందిన విద్యార్ధి కొండన్న మయన్మార్‌కి చెందిన వాడు. అతడు యూనివర్సిటీలో బుద్ధిజంలో ఎంఏ చదువుతున్నాడు. కొండన్న మృతి చెందడంతో మయన్మార్‌లో ఉంటున్న అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు నాగార్జున యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
సాధారణంగా గ్రామాలు, ఏజెన్సీల్లోని ప్రజలు వర్షాల సమయంలో పుట్టగొడుగుల కోసం పొలాల వెంట, అండవుల్లో తిరుగుతుంటారు. అయితే పుట్టగొడుగులు ఎక్కువగా పాము పుట్టలున్నచోట పెరుగుతుంటాయి. కొందరు అజాగ్రత్తగా వాటిని సేకరించే క్రమంలో పుట్టల్లోని పాములు బయటికి వచ్చి, వారిని కాటు వేస్తుంటాయి. ఇలా ఇప్పటికే ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు చోటు చేసుకున్నాయి.