తుఫాను వస్తే వడగళ్ళ వానలు పడటం సహజం..అయితే, అప్పుడప్పుడు వానతో పాటు చేపలు, కప్పలు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటాయి..అలాంటి విచిత్ర ఘటనే ప్రకాశంజిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశంజిల్లా కంభం మండలం హజరత్ గూడెం గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత తెరిపి ఇవ్వడంతో ఇంకా రైతులు పొలాల బాటపట్టారు. భారీ వర్షాలు, వరదలతో తమ పొలాలు ఎలా ఉన్నాయో చూసేందుకు వెళ్లిన ఓ రైతుకు అక్కడో ఊహించిన దృశ్యం కంటపడింది. అతడి పంట పొలంలో కనిపించిన ఆ దృశ్యం చూసి ఆ రైతు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. పొలం అంతా పచ్చని కప్పలతో కళకళలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే తోటి రైతులు, గ్రామస్తులకు విషయం వివరించాడు.
పసుపు పచ్చని రంగులో ఉన్న ఈ కప్పలు స్థానికంగా ఉండే కప్పలు కావని, ఇవన్నీ సముద్రంలో ఉండే కప్పలుగా భావిస్తున్నారు… పొలంలో కుప్పలు తెప్పలుగా సముద్ర కప్పలు కనిపించడంతో వర్షం నీటితో పాటు మేఘాల్లో ప్రయాణించిన కప్పలు వాన కురియడంతో పొలంలో పడిపోయి ఉంటాయని చెబుతున్నారు. పసుపు రంగులో ఉన్న కప్పలను చూసేందుకు స్థానికులు ఉత్సాహంగా బారులు తీరారు. అయితే, చుట్టుపక్కల పొలాల్లో ఎక్కడా ఈ రంగు కప్పలు కనిపించలేదు. కేవలం ఒక్క రైతుకు చెందిన పొలంలోనే ఇలాంటి కప్పలు పెద్ద మొత్తంలో కనిపించటంతో అంతరూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..