కర్నూలు, జనవరి19; నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు 11 రోజులపాటు మహశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు దేవస్థానం పరిపాలన భవనంలో ప్రాధమిక సమావేశాన్ని నిర్వహించారు, ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్, వైద్య,పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్,ఈవో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది అంతా కృషిచేయాలని సూచించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబందించిన అంశాలను కూలంకుషంగా చర్చించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు.
అధికారులందరూ పరస్పర సమన్వయంతో ఉత్సవాలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలు, అధికారులకు సూచించారు. దేవస్థానం ఉద్యోగులంతా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పారు. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలని చెప్పారు. దేవస్థానం పరిధిలోని విభాగాల వారీగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కూలంకుషంగా చర్చించారు. అదేవిధంగా క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు విచేస్తారని, పాదయాత్ర మార్గంలోని భీమునికొలను, కైలాసద్వారం మార్గంలో విచ్చేసే భక్తులకు ఎంటుంటి అసౌకర్యం కలగకుండా అటవీశాఖ అధికారులతో కలసి ఎర్పాట్లను చేయాలని ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే ప్రతి విభాగం యాక్షన్ ప్లాన్ రూపొందించి కార్యాలయానికి అందించాలని, ఆక్షన్ ప్లాన్ అనుగుణంగా ఏర్పాట్లను వెంటనే చేపట్టాలన్నారు. అలాగే ఉత్సవాలలో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు, శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు మొదలైన వాటిని చర్చించారు.
బ్రహ్మోత్సవాలలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఉత్సవాలలో పండుగ వాతావరణం ఉండేవిధంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని పాతాళగంగలో అవసరమైన ఏర్పాట్లను ముఖ్యంగా రక్షణ కంచే ఏర్పాటు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన షెడ్ల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆలయ చైర్మన్,ఈవో పెద్దిరాజు ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..