
టెక్స్ టైల్స్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుందని, ఇప్పటికైనా ఈ పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూలు మిల్లులు మూసివేయాలని ఏపీ టెక్స్ టైల్ మిల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. అక్టోబర్ 11వ తేదీ మంగళవారం నుంచి 15 రోజులపాటు పూర్తిగా నూలు పరిశ్రమలు మూతపడనున్నాయి. ఈ మేరకు ఏపీ టెక్స్ టైల్స్ మిల్స్ అసోసియేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. గత కొంత కాలంగా స్పిన్నింగ్ పరిశ్రమల ఎన్నో ఒడుదోడుకులను ఎదుర్కొంటుందని, ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో పరిశ్రమ పరిస్థితి రోజురోజుకు క్షిణిస్తోందని ఏపీ టెక్స్ టైల్స్ కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో నూలు మిల్లులు మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ టెక్స్ టైల్స్ అసోసియేషన్ ఛైర్మన్ రఘురామిరెడ్డి తెలిపారు. ఆన్ లైన్ విధానంలో జరిగే మల్టీ కమాడిటీస్ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) కారణంగా నూలు మిల్లులకు ఈ పరిస్థితి దాపురించిందని ఏపీ టెక్స్ టైల్స్ కార్యవర్గం ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను మల్టీ కమాడిటీస్ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) నుంచి కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిశ్రమకు రావాల్సిన వడ్డీ రాయితీలు, బకాయిలను తక్షణమే విడుదల చేసి పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో పరిశ్రమ మనుగడ భారంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో రూ.237 కోట్ల బకాయిలు విడుదల చేసిందని, మిగిలిన రూ.1400 కోట్లను విడుదల చేసి పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. టెక్స్ టైల్స్ రంగాన్ని పార్వర్డ్ ట్రేడింగ్ నుంచి తప్పిస్తేనే పరిశ్రమ మనుగడ సాగిస్తుందన్నారు.
ఏపీలో ప్రస్తుతం 50% సామర్థ్యంతో నూలు మిల్లులు పనిచేస్తుండగా, అక్టోబర్ 11వ తేదీ నుంచి పూర్తిగా మిల్లులు మూసివేయాలని పరిశ్రమల ప్రతినిధులు నిర్ణయించారు. కోవిడ్ కు ముందునుంచే స్పిన్నింగ్ మిల్లులు సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా కరోనా తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయని ఏపీ టెక్స్ టైల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో స్పిన్నింగ్ మిల్లులు పూర్తిగా మూతపడ్డాయని, ఆ తర్వాత అన్ని రంగాలు ఎంతో కొంత కోలుకున్నప్పటికీ, టెక్స్ టైల్స్ రంగంలో ఉన్న పూర్వపు సంక్షోభం కారణంగా ఇప్పటికి బయటపడలేకపోతున్నామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసేందుకు స్పిన్నింగ్ మిల్లుల మూసివేత నిర్ణయం తీసుకున్నామన్నారు.
స్పిన్నింగ్ మిల్లుల మూసివేత నిర్ణయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏపీలో ప్రస్తుతం దాదాపు 125 నూలు పరిశ్రమలు ఉండగా.. ఒక పరిశ్రమలోనే వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే పత్తి పండించే రైతులకి కూడా గిట్టుబాటు ధర వస్తుంది. ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఏపీలో ఉన్న అనేక పరిశ్రమలు మూడపడే స్థితికి చేరుకున్నాయి. నూలు పరిశ్రమల మూతతో రాష్ట్రంలో దాదాపు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కార్మికులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి.