ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. వై నాట్ ఏపీ అనే నినాదంతో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలతో తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. ఏపీలోనూ అలాంటి గ్యారంటీలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తోంది. షర్మిల చేరికతో లాభపడ్డామని.. గ్యారంటీలతో మరింత మైలేజీ వస్తోందని భావిస్తోంది.
రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒకప్పుడు ఏపీలో ఓ వెలుగువెలిగిన కాంగ్రెస్.. అక్కడ పాతాళానికి పడిపోయిన పరిస్థితి. ఏపీలో కాంగ్రెస్ మళ్లీ కోలుకుంటుందా ? అనే సందేహాల వ్యక్తమవుతున్న వేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. షర్మిల రాకతో పరిస్థితి మారుతుందన్న ధీమా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఏడాది ఏపీ రాజకీయాలు మారతాయని.. ఏపీలో తాము బలపడతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ఆ పార్టీ రోడ్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నట్టు కనిపిస్తోంది.
ఏపీలో రాజకీయం మారుతోంది. మారుతున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఏపీకి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఏలూరులో జరిగిన సమాలోచన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలు నెరవేరుస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. వీటితో పాటు ఏడు గ్యారంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళతామని చెబుతున్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించి విజయం సాధించామని.. తెలంగాణలో ఆరు గ్యారంటీ ద్వారా గెలుపు తమ సొంతమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం చెప్పారు. అదే విధంగా ఏపీలో ఏడు గ్యారంటీలను ప్రకటిస్తామని తెలిపారు.
షర్మిల చేరిక ద్వారా ఏపీలో తమ పార్టీ బలం పుంజుకుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. రాబోయే రోజుల్లో పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఓ వైపు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు ప్రజలను ఆకర్షించేందుకు గ్యారంటీ పథకాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…