Monsoon: జూన్‌ 5 నాటికి ఏపీకి నైరుతి రాక.. నేడు, రేపు పిడుగులతో భారీ వర్షాలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాసేపు మబ్బులు, కాసేపు వడగాలులు, కాసేపు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలుతో వాతావరణం దోబూచులాడింది. మరోవైపు వచ్చేనెల మొదటి వారం నాటికి రాష్ట్రంలోకి..

Monsoon: జూన్‌ 5 నాటికి ఏపీకి నైరుతి రాక.. నేడు, రేపు పిడుగులతో భారీ వర్షాలు
Southwest monsoon to AP

Updated on: May 16, 2025 | 7:49 AM

అమరావతి, మే 16: అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో నైరుతి రుతు పవనాలు చురుకుగా కదులుతున్నాయి. వచ్చే నెల మొదటి వారం నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్‌ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్‌ 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు-కొమోరిన్‌ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతోపాటు, అండమాన్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలోకి చకచకా విస్తరించాయి. వచ్చే 3, 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, అండమాన్‌లోని మిగిలిన ప్రాంతాలలో, అలాగే మధ్య బంగాళాఖాతంకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

అటు వాన.. ఇటు వేడి.. రాష్ట్రంలో భిన్న వాతావరణం

ఇదిలా ఉంటే.. మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాసేపు మబ్బులు, కాసేపు వడగాలులు, కాసేపు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలుతో వాతావరణం దోబూచులాడింది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురిశాయి. అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో వాయువ్య, నైరుతి దిశగా వీస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణం ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు.

వాతావరణంలోని అనూహ్య మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శుక్రవారం (మే 16) అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం (మే 17) అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అలాగే శుక్రవారం ఉత్తరాంధ్రలో దాదాపు 10 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో నిడమర్రు, అమలాపురం, కాజులూరు, కె.కోటపాడు, ఉంగుటూరు, కరప, పిఠాపురంలో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురిసింది. ప్రస్తుతం మామిడి సీజన్‌ కావడంతో వర్షం దాటికి పలుచోట్ల మామిడి నేల రాలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటతోపాటు కాకర, బీర, బీన్స్, రాగి, అరటిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.