Monsoon Updates: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. మంగళవారం సాయంత్రానికి ఏపీలోకి నైరుతి రుతుపవనాలు

|

Jun 06, 2022 | 7:24 PM

మంగళవారం సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే, వైజాగ్‌, కాకినాడ వంటి తీర ప్రాంత నగరాల్లో..

Monsoon Updates: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. మంగళవారం సాయంత్రానికి ఏపీలోకి నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon
Follow us on

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మంగళవారం సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే, వైజాగ్‌, కాకినాడ వంటి తీర ప్రాంత నగరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. తీర ప్రాంతాన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఉందని, పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఐఎండీ అధికారులు. నైరుతి రుతుపవనాల రాకతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తున్నాయి. మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, మాగనూరు, నల్గొండ, హైదరాబాద్ వరంగల్‌ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.

సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువ వానలు..

ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువ వానలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణలో సాధారణ వర్షపాతం 72.05 సెంటీమీటర్లు కాగా.. గతేడాది వానాకాలంలో 100.97 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి మొత్తంమీద 104 శాతం మేర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కదలికలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంచనాల్లో మార్పులు ఉంటాయని నిపుణులు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా..

మరోవైపు.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలను కలవరపెడుతున్నాయి. మరోవైపు గోవా, మహారాష్ట్రల్లో 2 లేదా 3 రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం.. రుతుపవనాలు మే 29 న కేరళ తీరాన్ని తాకాయి. అయితే దాని పురోగతి అంచనా ప్రకారం జరగడం లేదు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్ 6 నాటికి రుతుపవనాలు గోవా తీరానికి చేరుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు గోవా దక్షిణ ప్రాంతంలోని కర్ణాటక, అరేబియా సముద్రానికే పరిమితమైంది.