ఇటీవల సరీసృపాలు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లోకి వస్తోన్న సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఆ కోవకు చెందిన ఓ ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఓ భారీ నాగుపాము హల్చల్ చేసింది. ఇంట్లో జనం మసలుతుండగానే లోపలికి ప్రవేశించిన నాగుపాము.. ఓ బీరువా వెనుక నక్కింది. అటూ.. ఇటూ పనుల నిమిత్తం తిరుగుతున్న వ్యక్తులు దాన్ని చూసి ఒక్కసారిగా భయంతో కేకలు వేసి కంగారుపడ్డారు.
బీరువా వెనుక నుంచి బయటికొచ్చిన నాగుపాము గుమ్మం వద్దే పడగవిప్పి నిల్చుని ఉండటంతో.. అందరూ బెంబేలెత్తిపోయారు. దాదాపు గంటన్నర వరకూ నాగుపాము బుసలు కొడుతూ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారాన్ని అందించారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ వర్మ చాకచక్యంగా నాగుపామును పట్టుకొని ఒక డబ్బాలో బంధించి, సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వేసవి ఎండలు కారణంగా చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ సరీసృపాలు జనావాసాల్లోకి వస్తున్నాయని.. పల్లెల్లో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..