కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని మల్లేశాల. ప్రశాంతమైన ఊరు. కుంచె అప్పన్న అనే వ్యక్తి అదృశ్యం ఈ వూళ్లో కలకలం రేపింది. ఉపాధి బాటలో అప్పన్న, అతడి భార్య సత్యవతి విజయవాడకు వలస వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ చిన్నా చితక పనులు చేసుకునేవాళ్లు. అప్పన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఉన్నంతలో ఆల్ హ్యాపీస్.
అయితే సొంతూరిలో అప్పన్నకు భూమి వుంది. వివాదాలు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరూ తరుచూ ఆ భూమి గురించి మాట్లాడుకునే వాళ్లు. అప్పన్న ఊళ్లో పెద్దలకు ఫోన్ చేస్తూ తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకునేవాడు. ఊళ్లో నుంచి బంధుమిత్రులు ఎవరు వచ్చినా వాళ్లకు అతిథ్యం ఇస్తూ ఇదే విషయంపై చర్చించవాడతడు. వాళ్ల సూచన మేరకు గత జూన్ 5న భార్యాభర్తలిద్దరూ మల్లేశాలకు వెళ్లారు. వూళ్లో పెద్దల్ని తమ బంధువులను కలిసి భూవివాదం గురించి చర్చించారు. అదే తమకు ఆధారమని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పెద్దలు వాళ్లకు భరోసానిచ్చారు. ఈ క్రమంలో సత్యవతి మల్లేశాల నుంచి విజయవాడకు వెళ్లింది. అప్పన్న ఊళ్లోనే వున్నాడు.
రోజులు..వారాలు గడిచాయి. అప్పన్న విజయవాడకు తిరిగి రాలేదు. అక్కడే ఏదైనా పనిలో కుదిరాడేమోనని భావించిందామె. కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో ఆమెకు అనుమానం కలిగింది. ఆందోళనతో తోటి కోడలికి, బంధువులకు ఫోన్ చేసింది. అప్పన్న ఇక్కడ లేడు కదా అన్న తోటి కోడలి మాటతో సత్యవతిలో కంగారు మొదలైంది. ఉన్నపళంగా మల్లేశాలకు చేరుకుందామె. చుట్టుపక్కల ఎక్కడైనా పనిలో కుదిరాడా? బంధువుల ఇంటికి వెళ్లాడా? ఆరా తీస్తే ఎలాంటి సమాచారం రాలేదు. ఏమై వుంటుంది? ఎటు వెళ్లాడని కంగారు పడుతున్న టైమ్‌లో తమ ఇంటి దగ్గరే దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిందామె.
స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటి ఆవరణలో వున్న సెప్టిక్ ట్యాంక్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. చెక్ చేస్తే.. సెప్టిక్ ట్యాంక్ గోతిలో అస్తిపంజరం కన్పించింది. పక్కనే వున్న దుస్తులను బట్టీ అవి అప్పన్నవేనని గుర్తించింది సత్యవతి. అంతే ఊళ్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఏం జరిగింది? ప్రమాదవశాత్తు గోతిలో పడి చనిపోయాడా? అంటే అలాంటి అవకాశం లేదు. అంటే ఎవరో పక్కా పథకం ప్రకారం అప్పన్నను హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడు నెలలు కావడంతో డెడ్‌బాడీ పూర్తిగా కుళ్లిపోయింది. ఆనవాళ్లను సేకరించిన పోలీసులు.. ఫోరెన్సిక్ టెస్ట్‌కు పంపారు. కాగా, సైంటిఫిక్ ఎవిడెన్స్‌పై దృష్టి సారించారు పోలీసులు. భూవివాదంతోనే అప్పన్నను పథకం ప్రకారం హత్య చేశారా? లేక కుటుంబ కలహాలు, మరేవైనా కారణాలున్నాయా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.